మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్షసాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఐతే వాచ్‌మెన్ రంగన్న మృతిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. రంగన్న మృతి వెనుక ఏదైనా కుట్ర జరిగి ఉండొచ్చన్నారు ఆదినారాయణ రెడ్డి. ఇప్పటికే ఈ కేసులో కీలక సాక్షులుగా ఉన్న జగన్ సమీప బంధువు డాక్టర్ అభిషేక్ రెడ్డి, మామ ఈసీ గంగిరెడ్డి మరణాలపైనా ఆదినారాయణరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాచ్‌మెన్ రంగన్న కీలక సాక్షిగా ఉన్నారు. ఐతే ఈ నెల 5న కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఐతే రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై స్పందించిన ఆధినారాయణ రెడ్డి…రంగన్నకు వయసు రీత్యా 70 ఏళ్లు ఉంటాయని, అతని దరిద్రానికి ఏం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. కానీ కన్ఫర్మేషన్ లేదని పేర్కొన్నారు ఆదినారాయణ రెడ్డి.
జగన్ ఆలోచన వెరైటీ. అది ఈ దేశంలో ఎవరికీ ఉండదన్నారు ఆదినారాయణ రెడ్డి. ఇందుకు ఉదాహరణ కూడా చెప్పారు ఆదినారాయణ రెడ్డి. భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి సింగపూర్, దుబాయి, మలేసియా, కువైట్ ఇలా ఎక్కడికో పోతాడు. మూడు నెలలో, నాలుగు నెలలో అక్కడ ఉంటాడని. రూ.200 కోట్లతోనో, రూ.300 కోట్లతోనో, రూ.400 కోట్లతోనో ఇక్కడికి తిరిగొస్తాడని పేర్కొన్నారు. మళ్లీ భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో రూ.20 వేలకో, రూ.30 వేలకో ఉద్యోగంలో చేరతాడు. జగనే అక్రమ మార్గంలో అక్కడికి డబ్బులు పంపుతాడు. తనేదో అక్కడ కంపెనీ పెట్టినట్టు.. అదే సూట్‌కేస్ కంపెనీ. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఇలాంటివి చేయడం సులభమన్నారు. అతనికి కండకావరం ఎక్కువై ఇలాంటివి చేస్తున్నాడు తప్ప..ఆలోచన లేకకాదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
2019 మార్చి 15న పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయం అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఐతే ఆ సమయంలో ఇంటికి వాచ్‌మెన్‌గా ఉన్న రంగన్న..సీబీఐకి వాంగ్మూలం ఇస్తూ కీలక విషయాలు బయటపెట్టాడు. ఐతే కేసు విచారణ సమయంలో ఉండగానే ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న మృతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.