నిన్న హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు. తాజాగా ఈ కోవలోకి మిల్కీ బ్యూటీ తమన్నా చేరబోతోంది. వరుడు ఇంకెవరో కాదు విజయ్ వర్మ. అతను కూడా నటుడే. వయసు రీత్యా, అందం రీత్యా చూసినా ఈ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనవచ్చు. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇద్దరూ కూడా ఇటు సినిమాలు, అటు వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నారు. ఇద్దరూ చెట్టపట్టాలేసుకు తిరగడం చూసిన వారంతా వీరిద్దరూ కలిసే ఉంటున్నట్టు నిర్ధరించారు. మొదట్లో వారు బుకాయించిన చివరికి ఒప్పుకోక తప్పలేదు.
తాజా వార్త ఏమిటంటే వీరు పెళ్లి చేసుకోబోతున్నారట. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్టు సమాచారం. దీనికి ఇరు కుటుంబాల్లోనూ గ్రీన్ సిగ్నల్ కూడా లభించేసిందట. త్వరలోనే అధికారికంగా పెళ్లి వార్త రాబోతోంది. విజయ్ వర్మ విషయానికి వస్తే విజయ్ వర్మ వయసు 37, తమన్నా వయసు 34. తెలంగాణలో స్థిరపడిన మార్వాడీ కుటుంబంలో పుట్టిన విజయ్ వర్మ రంగస్థల నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. పుణే ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పూర్తి చేసుకుని ముంబైకి తన మకాం మార్చాడు. షార్ట్ ఫిలిమ్స్ తో మొదలు పెట్టి పింక్ చిత్రంలో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఇక తమన్నా భాటియా విషయానికి వద్దాం. ఆమె మహారాష్ట్రలోని బొంబాయిలో జన్మించింది. ఆమె సింధీ హిందూ సంతతికి చెందినది.
ముంబైలోని మేనకాజీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్ లో చదువుకుంది. పదమూడు సంవత్సరాల వయస్సులోనే నటనలో ఓనమాలు దిద్దింది. ఒక సంవత్సరం పాటు పృథ్వీ థియేటర్‌లో చేరి శిక్షణ తీసుకుంది. అక్కడ ఆమె స్టేజ్ ప్రదర్శనలలోనూ పాల్గొంది. 2005లో అభిజీత్ సావంత్ ఆల్బమ్ ఆప్కా అభిజీత్లోని లఫ్జో మే పాటతో చిత్ర పరిశ్రమలోకి కాలుపెట్టింది.హిందీ చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రాలో ప్రధాన పాత్రలో నటించింది. 2006లో శ్రీ సినిమాతో మంచు మనోజ్ సరసన నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె కెరీర్ తెలిసిందే. 2007లో హ్యాపీ డేస్ ఆమె నట జీవితాన్ని మార్చేసింది.
విజయ్ వర్మతో ఎక్కడ పరిచయం?
సినిమా వాళ్ల ప్రేమ సినిమా నుంచే మొదలవుతుంది. లస్ట్ స్టోరీస్ 2 చిత్రంలో నటించినప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ అంకురించింది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో తమన్నా, విజయ్ వర్మ ముద్దులు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దాంతో పుకార్లు మొదలయ్యాయి. తరచూ ముంబైలో కలిసి తిరుగుతూ కనిపించారు. ఈ పుకార్ల మీద ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ‘మేము కలిసి ఒక సినిమా చేశాం. ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి. వాటన్నింటిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని గురించి నేను చెప్పేదేమీ లేదు’ అంటూ కొట్టిపారేసిందామె. చివరికి వారి ప్రేమను ఆమె ఒప్పుకోక తప్పలేదు. తాను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తి అతనేనని ఫిల్మ్ కంపానియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. త్వరలోనే ఈ జంట పెళ్లి వార్త కోసం మనం ఎదురుచూద్దాం.