మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య రిలీజ్ కి రెడీగా ఉంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కంప్లీట్ కాకుండానే బాబీ డైరెక్షన్ లో తెరకెక్కే మూవీని సినీ ప్రముఖుల సమక్షంలో ఇటీవల స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
ఇప్పుడు మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేయనున్న భోళా శంకర్ మూవీని కూడా స్టార్ట్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. చిరు సరసన మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. ఇన్నాళ్లు కథానాయిక ఎవరు అనేది సస్పెన్స్ గా ఉండేది. అయితే.. నిన్నే తమన్నాను ఎంపిక చేసినట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి టెస్ట్ లుక్ అండ్ ఫోటో షూట్ చేశారని ప్రకటించారు.
ఇక ఈ సినిమాని ఈనెల 11న ఉదయం 7.45 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ ను ఈ నెల 15 నుంచి స్టార్ట్ చేయనున్నారు. 2022లో ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. మొత్తానికి.. మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. యమా స్పీడుగా సినిమాలు చేస్తూ దూసుకెళుతుండడం విశేషం.











