ఐఎండీబీ ఆల్ టైమ్ టాప్ హిట్ కు సంబంధించిన 250 సినిమాల జాబితాలో ‘జైభీమ్’ సినిమా అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు ఇంతకుముందెప్పుడూ ఏ తమిళ సినిమాకూ రాని రేటింగ్ దీనికి మాత్రమే దక్కింది. ఐఎండీబీ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఓట్లను బట్టి ఈ రేటింగ్ ఇస్తారు. వారం రోజుల వ్యవధిలోనే 57667 ఓట్లతో 9.6 రేటింగ్ ను ఈ సినిమా సాధించింది. ఈ 250 సినిమాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న‘ది శశాంక్ రిడంప్షన్’ను వెనక్కి నెట్టేసింది. ఈ సినిమా 9.3 రేటింగ్ తో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో హాలీవుడ్ చిత్రం ‘గాడ్ ఫాదర్’ ఉంది.
ఒక ప్రాంతీయ చిత్రం ఈ స్థాయిలో రేటింగ్ సాధించడం విశేషం. జైభీమ్ చిత్రం సాధించిన అరుదైన ఘనత ఇది అని చెప్పాలి. కమర్షియల్ అంశాలు లేకుండా అందరి మెప్పునూ ఈ సినిమా పొందింది. ఐఎండీబీలో టాప్ 250 సినిమాల జాబితాలో అగ్రస్థానంలో ఈ సినిమా ఉండటం తమిళ చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా చెప్పాలి. అంతేకాదు మొదటి దక్షిణాది చిత్రం కూడా. అసలు ఇప్పటిదాకా ఐఎండీబీ 250 సినిమాల జాబితాలో ఒక్క తమిళ చిత్రం కూడా లేదు. అలా చేరుకున్న మొదటి సినిమాగా కూడా జైభీమ్ ను చెప్పాలి. నటుడు సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దీన్ని నిర్మించారు. టీజే జ్ఞానవేల్ దీనికి దర్శకత్వం వహించారు.
హిందీ చిత్రాలు సర్దార్ ఉదమ్, అమీర్ ఖాన్ దంగల్, త్రీ ఇడియట్స్, అనురాగ్ కశ్యప్ యొక్క ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ మరియు ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధాధున్’ తదితర చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మన తెలుగు చిత్రం కూడా ఇప్పటిదాకా ఈ జాబితాలో చేరలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా భారతీయ చిత్రాలకే గర్వకారణంగా నిలిచిందని చెప్పాల్సి ఉంటుంది. ఇంతకుముందు సూరారై పోట్రు, జైభీమ్ చిత్రాలతో హీరోగా, నిర్మాతగా సూర్య అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు. ఇలాంటి మంచి అభిరుచితో సూర్య మరికొన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది.











