“కదలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా..త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా..”
ఈ పాట తెలియని వారు ఎవరూ ఉండరు. వారు ఏ పార్టీకి చెందిన వారైనా ఆ పాటకు, ఆ పాట పాడిన గాత్రానికి మంత్ర ముగ్దులు కావాల్సిందే. ఈ పాట తెలుగుదేశం పార్టీకి సంబంధించినది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి ఈ పాటను వాడేది. కదలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా.. పాట వింటున్నప్పుడల్లా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పసుపు జండా పొగరు చూపించాల్సిన సమయం వచ్చిందనే భావనను పార్టీ కార్యకర్తల్లో రగిలించేది. తెలుగు తమ్ముళ్లను ఈ పాట ఆ నాడు ఉరకలెత్తించింది. టిడిపి ప్రచార పాటల్లోకెల్లా ఈ పాట ఎప్పటికీ నెంబర్ వన్ స్థానంలోనే ఉంటుంది. ఈ పాట ఇంతగా ఫేమస్ అవ్వడానికి రచన, గాత్రమే ప్రధాన కారణం. ఈ పాటకు బాలుగారే గాత్రదానం చేశారు.
ఓటర్లను ప్రభావితం చేసిన పాట..
టిడిపి పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఈ పాట కచ్చితంగా ఉండాల్సిందే. తెలుగు తమ్ముళ్లు మొబైల్స్‌లో కూడా మోగుతుంది. చాలామంది టిడిపి కార్యకర్తలు దీనిని కాలర్ ట్యూన్‌గా పెట్టుకునే వారు. బాలు మరణం తర్వాత ఆయన పాడిన కదలిరండి తెలుగు దేశ కార్యకర్తలారా పాటను ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. ఆ పాట ఎప్పటికీ తమ ఆల్‌టైమ్ ఫేవరెట్ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం తెలుగు దేశం పార్టీకే కాదు మరికొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు కూడా పాడారు. ఆనాడు తెలుగు దేశం పార్టీ కోసం పాడిన ఓ పాట ఓటర్లను ఎంతగానో ప్రభావితం చేసింది. బాలు గాత్రంలో ఉన్న కమ్మదనం.. తియ్యదనం.. రౌద్రం.. కరుణ అలాంటిది మరీ.











