శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన రాజాం అసెంబ్లీ రాజకీయాలు ఆకస్మికంగా వేడెక్కాయి. రిజర్వుడు నియోజకవర్గమైన రాజాంలో నిన్న .. మొన్నటి వరకూ రాజకీయాలు స్తబ్దుగా ఉండేవి. వైసీపీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు .. రాజకీయంగా ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్నారని టాక్. ఈ తరుణంలో టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కావలి ప్రతిభా భారతి తన కుమార్తె గ్రీష్మను.. తన రాజకీయ వారసురాలుగా రంగంలోకి దించే యోచన చేస్తుండటంతో ఇక్కడ రాజకీయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హోరా – హోరీ పోరు
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ, టీడీపీల నడుమ హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఇరు పార్టీల తరఫున బలమైన లీడర్లు తలపడుతున్నారు. అన్ని జిల్లాలతో పోలిస్తే ఇక్కడ రెండు పార్టీలూ సమానంగా ఉన్నాయి. ఎవరికి వారు.. ఎప్పటికప్పుడు లీడర్లను తయారుచేసుకుంటున్నారు. రాజాం నియోజకవర్గం నుండి వరుసగా వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుంది. మొదట టీడీపీలో ఉన్న ఆయన తర్వాత ప్రజారాజ్యం, చివరకు వైసీపీలో చేరారు. 2009లో ప్రజారాజ్యం నుండి టికెట్ పొందిన ఆయన మూడవస్థానంలో నిలిచారు. 2014లో వైకాపా నుండి పోటీచేసి విజయం అందుకున్నారు. అలాగే 2019లో కూడ గెలుపొందారు. తన ప్రత్యర్థి టీడీపీకి చెందిన కొండ్రు మురళీ మీద సులువుగానే గెలిచారు. కానీ 2014 ఎన్నికల్లో మాత్రం ప్రతిభా భారతి మీద అంత ఈజీగా నెగ్గలేకపోయారు. తీవ్రమైన పోటీ నడుమ కేవలం 512 ఓట్లతో గట్టెక్కారు. గత ఎన్నికల్లో కొండ్రు మురళీకి కాకుండా ప్రతిభా భారతికే టికెట్ ఇచ్చి ఉంటే ఆమె గెలిచే వారని ఇప్పటికీ అక్కడి టీడీపీ శ్రేణులు అంటూ ఉంటారు. దళిత నాయకురాలిగా శ్రీకాకుళం జిల్లాలో ఆమెకు బలమైన క్యాడర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్‌గా మంచి పేరుంది ఆమెకు. శాసనసభ్యురాలుగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పని చేశారు.

పూర్వ వైభవానికి ప్రయత్నం
రాజాంలో కావలి కుటుంబానికి ఇప్పటికీ మంచి పట్టుంది. అందుకే ఈసారి ఆమె తన కుమార్తె గ్రీష్మను బరిలోకి దింపి .. పూర్వ వైభవం సాధించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుండే టికెట్ ఆశిస్తున్నట్లు వినికిడి. టీడీపీ టికెట్ తన కుమార్తెకు ఇస్తే గెలిపించుకుంటానని సంకేతాలు కూడా అధిష్టానానికి ఇప్పటికే పంపినట్లు సమాచారం. ఒకవేళ టీడీపీ టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీ నుండైనా .. ఏదీ కుదరకపోతే స్వతంత్య్ర అభ్యర్థిగానైనా పోటీలో నిలపాలని భావిస్తున్నారట. వీటిలో ఏది జరిగినా సిటింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులుకు గట్టి పోటీ తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.











