తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారును గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. నిన్న రాత్రి విజయవాడలో పట్టాభి ఇంటి ముందు నిలిపి ఉంచిన కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగుల గొట్టారు. పట్టాభి ఇంటి పక్కనే జడ్జి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి వద్ద పోలీస్ పికెట్ కూడా నిర్వహిస్తున్నారు. పక్కనే పోలీసులు ఉన్నా పట్టాభి కారును ఎలా ధ్వంసం చేయగలిగారో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి, ఎమ్మెల్యే హస్తం ఉందా?
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఎప్పుడూ ముందుంటారు. 108 అంబులెన్సుల నిర్వహణ కాంట్రాక్టు కేటాయింపుల్లో అవకతవకలు, ఏపీ అప్పుల్లో దేశంలోనే నెంబర్ వన్ అయ్యాయని పట్టాభి వైసీపీపై విమర్శలు గుప్పించారు. దీనిపై వైసీపీ నేతలు గతంలోనే పట్టాభి ఇంటి వద్ద పోలీసులను పెట్టి రెక్కీ నిర్వహించారనే వార్తలు సంచలనం రేపాయి.
తాజాగా విశాఖలో సబ్బంహరి ఇంటి వద్ద బాత్రూములు కూల్చివేయడం, ఆ మరుసటి రోజే విజయవాడలో పట్టాభి ఇంటి ముందు నిలిపిన కారును ధ్వంసం చేయడం వంటి ఘటనలపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో గూండా రాజ్ పాలన నడుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. పట్టాభి కారు ధ్వంసంలో ఓ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యేల హస్తం ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు.
ఏమిటీ అరాచకం?
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే ఏపీలో మాత్రం వాక్ స్వాతంత్ర్యం అమలు అవుతున్నట్టు కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎవరైనా ఎండకడితే వెంటనే వారిపై అరాచక శక్తులు దాడులకు దిగుతున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. వైసీపీ వారి దాడులకు భయపడేది లేదని పాలనలో వారి వైఫల్యాలు, వైసీపీ నేతల అవినీతిని వెలికితీయడంలో వెనుకంజ వేసేదే లేదని ఆయన స్పష్టం చేశారు.
లోకేష్, చంద్రబాబు పరామర్శ
పట్టాభి కారు ధ్వంసం విషయం తెలియగానే టీడీపీ అధినేత చంద్రబాబనాయుడు, తనయుడు లోకేష్ పట్టాభికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి దాడులకు భయపడాల్సిన పని లేదన్నారు. దళితులపై, టీడీపీ శ్రేణులపై వైసీపీ వారి దాడులు నిత్యకృత్యంగా మారాయని వాటిని సమర్ధంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.











