రాష్ట్రంలో తెరాసకు ప్రధాన ప్రత్యర్థి అని చెప్పుకునే భాజపాలో ఎన్నికల లొల్లితో నాయకులు రాజకీయ గ్రూపులుగా చీలి చెలరేగిపోతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో పైచేయి కోసం భాజపా నానా పాట్లు పడినప్పటికీ.. ఫలితం దక్కలేదు. ఇప్పటినుంచే కష్టపడితే వచ్చే ఎన్నికలకు ఉపయోగం ఉంటుందనే భావనలో వారున్నారు. పార్టీ జిల్లా కమిటీలకు పటిష్ట నాయకత్వం కోసం ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
జాతీయస్థాయిలో ప్రధాన భూమిక పోషిస్తున్న భారతీయ జనతాపార్టీ తెలంగాణలోను పాగా వేయాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇందు కోసం జిల్లా స్థాయి నుండి రాష్ట్రం వరకు పార్టీని పటిష్టం చేయడానికి గాను పార్టీ ఎన్నికలు ఎంతో దోహద పడతాయి అని భావించింది. రాష్ట్రంలోని 31 జిల్లాలో ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా 6 జిల్లాల్లో మాత్రం వాయిదా వేశారు. వికారాబాద్, సూర్యాపేట, మిర్యాలగూడ, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
అంతే కాకుండా హైదరాబాద్ నగరాన్ని ఉత్తరం. దక్షణ, తూర్పు. పడమర నాలుగు జోన్ లుగా విభజించి అధ్యక్షులను నియమించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో నగరానికి నలుగురు అభ్యర్ధులను అధ్యక్షులుగా ఎన్నుకోవాల్సి ఉంది. అంతే కాకుండా మేడ్చల్. రంగారెడ్డి జిల్లాలకు ఇద్దరు చొప్పున అధ్యక్షులను నియమించాలని ప్రతిపాదించారు. దీంతో ఈ జిల్లాలో ఎన్నికలను వాయిదా వేశారు. జిల్లాల్లో గ్రూప్‌లు పెరిగిపోయాయి. ఎన్నికలు జరగని అన్ని జిల్లాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల మధ్యన విభేదాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. నాయకులు , కార్యకర్తలు పైకి కలిసి ఉన్నట్టు నటిస్తున్నారు. పక్కకు జరిగితే ఒకరిపై ఒకరు కడుపు మంటను వెళ్ళ గక్కు తున్నారు.
అధిష్టానం తననే అధ్యక్షుడు గా ఎంపిక చేస్తారు అంటే తన వైపు కార్య కర్తలు అధికంగా ఉన్నారు తనకే అధ్యక్ష పట్టం కడతారని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. ఎవ రికి వారు వ్యక్తిగతంగా తమ ఉనికిని చాటు కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేడ్చల్. వికారాబాద్. రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ పరిస్థితిని పరిశీలిస్తే సాధారణ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలుపుకునే స్థాయి కూడా లేదు. దీనంతటీకీ జిల్లా పార్టీ సీనియర్ల పోకడే కారణమని కార్యకర్తలు వాపోతున్నారు. వికారాబాద్ జిల్లా అధ్యక్ష స్థానానికి వికారాబాద్ కు చెందిన బీజేపీ నాయకులు సదానంద రెడ్డి. మాధవరెడ్డి, శివరాజ్. తాండూర్ కు చెందిన రమేశ్, కొడంగల్ కు చెందిన పూనం చాంద్ లహోటి పోటీపడుతున్నారు. బీజేపీ లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి పార్టీ ఎన్నికలు నిర్వహించి పదవులను కట్టబెడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గా ప్రహ్లాదరావు ఉన్నారు. పరిగి కి చెందిన ఆయన పదవీకాలం ముగిసింది ఈ సారి వికారాబాద్ కు చెందిన నాయకులకు అధ్యక్ష పదవి కావాలని పట్టుబడుతున్నారు.











