పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహము నాడు పొందుర సుమతీ
అని పెద్దలు మనకు నీతిని తెలియజెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇదే తరహాలో ఇప్పుడు పుత్రికోత్సాహం కలుగుతోంది. ఆయన పెద్ద కుమార్తె హర్షారెడ్డి ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‍లో సీటు సాధించింది. ఆమె పారిస్ క్యాంపస్‍లో మాస్టర్స్ డిగ్రీ చదవనుంది. ఆమెను పారిస్ కు సాగనంపేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సకుటుంబ సమేతంగా మంగళవారం బెంగుళూరు వెళ్తున్నారు.
వైఎస్ జగన్- భారతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హర్షారెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. హర్షారెడ్డి ఇప్పుడు పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయనున్నారు.
కూతురు ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలో సీటు తెచ్చుకోొవడం అనేది ఏ తండ్రికైనా గర్వకారణమే అవుతుంది. అందుకే.. జగన్ కు ఇప్పుడు పుత్రికోత్సాహం కలుగుతోందని పలువురు అనుకుంటున్నారు.











