త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ సారి తమకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతూ గాంధీభవన్‌కు ధరఖాస్తులు, వినతులు పెద్ద ఎత్తున వస్తున్నాయట. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన సరికొత్త ఫార్ములాను తెలంగాణలో అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తమిళనాడు రాజకీయాల్లో ఎదురైతే కూడా అక్కడి నాయకత్వం ఎన్నికల్లో ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతారట.
కొత్త రూల్ ఇదే…
కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఏవరైనా తమ దరఖాస్తుతోపాటు రూ.10వేల చెక్‌ను డిపాజిట్ చేయాలట. ఇదే విషయాన్ని మాణిక్కం ఠాగూర్ గత కోర్ కమిటీ సమావేశంలో తన అభిప్రాయాన్ని పార్టీ నేతల ముందు ఉంచినట్లు చర్చ జరుగుతోంది. ఈ రూ.10వేల నిబంధన వల్ల సగం తలనొప్పి తగ్గుతుందనే భావనలో మాణిక్కం ఉన్నారట. తమిళనాడు ఎన్నికల్లోనూ సొంత పార్టీ నేతల నుంచి పోటీ ఎక్కువగా ఉంటే ఇలాంటి రూల్‌నే ఫాలో అవుతారట. అలాగే రిజర్వుడ్ స్థానం నుంచి పోటీ చేయాలనుకునే వారు మాత్రం రూ.5వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందట. అయితే ఓడినా గెలిచినా ఈ డిపాజిట్‌ను తిరిగి వెనక్కి ఇచ్చేది లేదట. దీంతోనైనా పోటీ చేయాలంటే కాస్త ఆలోచిస్తారని మాణిక్కం ఉద్ధేశంగా కనబడుతోంది.
వారికి పదివేలు ఒక లెక్కా..
సొంత పార్టీ నేతల మధ్య టిక్కెట్ల కోసం పోటీని తగ్గించేందుకు మాణిక్కం తీసుకొస్తున్న ఈ నిబంధన బాగానే ఉన్నా.. కార్పొరేటర్ల ఎన్నికల్లో రూ.లక్షలకు లక్షలు ఖర్చు చేసేందుకు వెనుకాడని నేతలకు ఈ రూ.10వేల నిబంధన ఒక లెక్కా? అనే అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్త మవుతోంది. పది వేలు కాకుంటే రూ.లక్ష డిపాజిట్ అని పెట్టినా కూడా పోటీకి వెనుకాడరు. మరోవైపు కొన్ని డివిజన్లలో కాంగ్రెస్‌పార్టీ నేతల్లో రెండేసీ మూడేసీ గ్రూపులున్నాయి. మరీ ఆ డివిజన్ నుంచి తన ప్రత్యర్ధికి టిక్కెట్ రాకుండా ఉండేందుకు ఇతరుల పేర్లతో రూ.10వేల డిపాజిట్‌లు ఓ నాలుగైదు చేసే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో సొంత పార్టీ నేతల మధ్యనే టిక్కెట్ కోసం పోటీ ఎక్కువై దాంతో ఇతర పార్టీ గెలిచే అవకాశం లేకపోలేదు. అసలు ఈ నిబంధనలను పక్కన బెట్టి గెలిచే అభ్యర్థులెవరో కాంగ్రెస్ పార్టీయే సర్వే చేసి గెలుపు గుర్రాలకు టిక్కెట్ ఇస్తే సరిపోతుందిగా అనే అభిప్రాయాలను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
కొత్త తలనొప్పులు…
సరే పార్టీ నిర్ణయం మేరకు రూ.10వేల చెక్ డిపాజిట్ చేసినా.. తీరా టిక్కెట్ ఇవ్వకుంటే ఎలా? అనే అనుమానాలు నేతలకు వెంటాడుతున్నాయి. అదికాకుండా మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నవారికి టిక్కెట్ ఇవ్వకుండా చివరి నిమిషంలో పార్టీలోకి జాయిన్ అయ్యే ఇతర పార్టీ నేతలకు టిక్కెట్ ఇస్తే ఎలా మరీ? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్టీలో రచ్చ రచ్చ జరిగే అవకాశం ఉంది. గతంలోనూ టిక్కెట్ ఆశించి బంగపడిన వారు ఏకంగా గాంధీ భవన్‌ను ముట్టడించిన సందర్భాలను మనం చూశాం. గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ ఇదే సీన్ రిపీటవుతే దానికి బాధ్యులెవరు? అనే చర్చ కూడా జరగుతోందట. అసలే పార్టీలో డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు ఒకరికి మరొకరితో పొసగడంలేదు. ఇలాంటి తరుణంలో అలాంటి నేతలందరినీ ఏకం చేయకుండా తమిళనాడులో అమలు చేసే నిబంధనలు ఇక్కడ ఎన్ని అమలు చేసినా ఫలితం ఉంటుందా? అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మాణిక్కం ఠాగూర్ గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తీసుకొస్తున్న ఈ కొత్త రూల్ ఎలాంటి ఫలితాలను రాబట్టుతుందో చూడాలి మరి.