2020 క్రికెట్ ఫార్మెట్ తరహాలో 2023 అసెంబ్లీ ఎన్నికలను తెలంగాణ ఏఐసిసి ఇంచార్జీ మాణిక్కం టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీనికోసం అందరూ ఒక క్రికెట్ జట్టులా పనిచేయాలని పార్టీ నేతలను ఆయన దిశానిర్ధేశం చేస్తున్నారు కూడా. తమ పార్టీలోని లుకలుకలను చక్కదిద్దకుండా పైకి తన టీమ్ క్రికెట్ జట్టు లాంటిదని, తాము ఒక టీమ్‌లాగా 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామనే అంశం పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, అందులోని నేతలందరూ కూడా క్రమశిక్షణ గలవారనే చెప్పే ప్రయత్నం గత కొన్నిరోజులుగా ఆయన చేసే ప్రకటనలను చూస్తే మనకు స్పష్టమవుతోంది. పిసిసి పదవిలో తానూ ఉండనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ పదవి కోసం డజన్ మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో పోటీ పడుతున్నారు. పిసిసి పీఠం కోసం తెలంగాణ కాంగ్రెస్ గ్రూపులుగా విడిపోయిందనే చర్చకూడా కార్యకర్తల్లో ఎప్పటి నుంచో ఉంది. మరీ అలాంటిది ఆ పదివిలో ఇప్పటి వరకు ఎవరినీ నియమించకుండా తమది ఒక క్రికెట్ టీమ్ అని, కుటుంబమని మాణిక్కం ఠాగూర్ పదేపదే చెప్పడం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం అనుకోవచ్చా అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది.
పిసిసి పీఠం కోసం నేతల మధ్య పంచాయితీ..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అనుకున్నంత ఎంపీ సీట్లను గెలవలేకపోయింది. అయితే కాంగ్రెస్ వరుస ఓటమికు బాధ్యతగా వహించి తాను పిసిసి అధ్యక్షుని పీఠం నుంచి తప్పుకుంటానని అప్పట్లో ఉత్తమ్ ప్రకటించారు. ఇలా ఉత్తమ్ ఎప్పుడైతే పిసిసి పీఠం నుంచి తప్పుకుంటానని ప్రకటించారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నేతలు ధిక్కార స్వరాలను వినిపించారు. పిసిసి పదవి తనకే ఇవ్వాలని ఒకరంటే.. లేదు పిసిసి పదవి ఈ సారీ తమ సామాజిక వర్గానికే అవకాశం ఇవ్వాలని మరొక నేత. ఇలా పిసిసి పీఠం కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలకు దారితీసింది. దీంతో ఎవరికివారూ పార్టీ ఎజెండాలను పక్కనబెట్టి తమ సొంత ఎజెండాలతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లిపోయారు. వెళ్లడమే కాదు ఒకరినొకరు విమర్శలు, ప్రతివిమర్శలు కూడా చేసుకున్నారు.
పిసిసి నియామకం తన చేతిలో లేని అంశం..
పిసిసి అధ్యక్ష పదవి కోసం రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ్మ, వి.హనుమంతరావు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, వంశీ చందర్ రెడ్డి, సంపత్ కుమార్, ఎస్టీల నుంచి రాములునాయక్, బలరాంనాయక్ తమకు అవకాశం ఉంటే చూడాలంటూ ఎవరికివారూ రకరకాల సోర్స్ ద్వారా హైకమాండ్ దగ్గర పిసిసి పీఠం కోసం లాబీయింగ్ చేస్తూ వస్తున్నారు. ఈ అంశం ఎటూ ముడిపడకుండా వస్తునే ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి ఏఐసిసి ఇంఛార్జ్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించడంతో ఇక పిసిసి పదవికి ఒక శుభం కార్డు పడుతుందని నేతలు భావించారు. కానీ పిసిసి పదవి నియామకం తన చేతిలో లేదని అది అధిష్టానం తేల్చే విషయమని మాణిక్కం ఠాకూర్ చెప్పడం విశేషం. అసలు పిసిసి పీఠం గురించి తేల్చకుండా తమది ఒక క్రికెట్ టీమని, తమ పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేధాలు లేవని, ఉన్నా అవి చిన్న చిన్న విషయాలేనని అనడమేంటనే చర్చ జరుగుతుంది.
కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు తలెత్తినయే పిసిసి పదవి కోసం. నువ్వా.. నేనా.. అన్నంతగా విమర్శల దాడి కూడా ఒకరినొకరు నేతలు చేసుకున్నారు. అలాంటిది పిసిసి నియామకం తన చేతిలో లేదనడం కేవలం మాణిక్కం మార్క్ రాజకీయమే అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎక్కడైనా కెప్టెన్ లేకుండా క్రికెట్ జట్టు ఉంటుందా? అనే ప్రశ్నలను పార్టీ వర్గాలు లేవనెత్తుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, నేతలకు పిసిసి అధ్యక్షుడు ఒక కెప్టెన్ లాంటి వాడు. మరీ కెప్టెన్ ను నియమించకుండా టీమ్ ఎలా ముందుకుపోతుందని కార్యకర్తలు అనుకుంటున్నారు. అలాగే కార్యకర్తలు కూడా కొత్త నాయకత్వాన్ని కోరుకుంటుంది. పిసిసి పదవి అంశాన్ని నాన్చిపెట్టే ధరోణిని మాణిక్కం ఠాకూర్ మార్క్ రాజకీయం అనుకోవలసి ఉంటుంది. ప‌్రజల్లో, ఇతర రాజకీయ పార్టీలకు తామంతా ఒక టీమే అనే భావనను ఆయన క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.











