స్టార్ హీరో సినిమా అంటేనే ఎంతో హడావిడి. అందులోనూ సూపర్ స్టార్ సినిమా అయితే ఆ షూటింగ్ లో సందడి మామూలుగా ఉండదు. పెద్ద ఎత్తున స్టార్ కేస్టింగ్, భారీ సెట్స్ .. ప్రాపర్టీస్ .. ఒకటేంటి? ఇలా ప్రతీ విషయంలోనూ భారీతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాంటి సినిమాలకు రోజుకు ఒక సీన్ తీయడమే గగనం. ఆ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అవడానికి ఎంత లేదన్నా మూడు నాలుగు నెలలు ఈజీగా పడుతుంది. అయితే మోహన్ లాల్ హీరోగా నటించిన ఓ మలయాళ సినిమా కేవలం 40రోజుల్లోనే పూర్తయిందంటే.. మీరు నమ్ముతారా?

మోహన్ లాల్, మీనా జంటగా మలయాళంలో రూపొందిన ‘దృశ్యం 2’ సినిమా ..ఈ ఏడాది సెప్టెంబర్ 25నే ప్రారంభమైంది. మధ్యలో ఆ సినిమాకి చిత్ర బృందం ఎన్నిరోజులు విరామం తీసుకుందో తెలియదు కానీ.. నవంబర్ 6 కల్లా సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ కరోనా అన్ లాక్ టైమ్ లో మోహన్ లాల్ లాంటి ఓ స్టార్ హీరో సినిమా కేవలం 40 రోజుల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఈ విషయంలో మోహన్ లాల్ కు సలాం కొట్టకుండా ఉండలేం. కరోనా నిబంధనలు పక్కాగా పాటిస్తూ.. సెట్లో క్రూ మెంబర్స్ అందరికీ టెంపరేచర్ చెక్ చేసి.. సానిటైజేషన్ చేసి..మరీ ఈ సినిమా షూటింగ్ ను జరిపారు నిర్మాతలు. ఈ సినిమా పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దృశ్యం మొదటి భాగం ఏ రేంజ్ లో హిట్టైందో తెలిసిందే. మొదటి భాగాన్ని తెరకెక్కించిన జీతు జోసెఫ్ డైరెక్షన్ లోనే రెండో భాగం రూపొందింది. అలాగే.. మోహన్ లాల్ భార్యగా మీనా, ఇద్దరు పిల్లలు మొదటి భాగం లోలాగానే.. ఇందులోనూ కంటిన్యూ అవుతున్నారు. మొదటి భాగం చైనా, సింహళ భాషల్లో సైతం మిగతా అన్ని భాషల్లోనూ రీమేక్ అయింది. మరి రెండో భాగం ఇంకెన్ని సంచలనాలకు తెరదీస్తుందో చూడాలి.










