కరోనా కేసులు తగ్గుతున్నాయిలే అనుకున్న లోపే మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. 27వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 28వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలో కొత్తగా 1481 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు బుధవారం విడుల చేసిన బులిటెన్‌లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. మంగళవారం విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో 837 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ తాజాగా 1481 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే పాజిటివ్ కేసుల విషయంలో ఇంతలా వ్యత్యాసం కనిపించడం ఆందోళన కల్గిస్తోంది.
సెంచరీకి తగ్గని కేసులు..
అయితే టెస్టుల సంఖ్య పెంచినందుకే ఇంతలా కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1,34,152కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల మరణించిన వారు నలుగురు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1319కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.5శాతంగా ఉంటే తెలంగాణలో మాత్రం 0.56 శాతంగా ఉంది. కరోనా నుంచి కొత్తగా కోలుకున్న వారు 1452 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,14,917. రాష్ట్రంలో రికవరీ రేటు 91.7శాతం ఉంటే దేశవ్యాప్తంగా అది 90.7 శాతంగా ఉంది.
యాక్టివ్ కేసులు 17,916 ఉన్నాయి. నిన్న ఒక్క రోజే ప్రభుత్వం 40,081 టెస్టులు చేసింది. టెస్టుల సంఖ్య పెరగడంతోనే తాజాగా కేసుల సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన కేసుల్లో ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లోనే కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 111, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 138 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 279 కేసులు కొత్తగా నమోదయ్యాయి. నిన్న విడుదల చేసిన బులిటెన్‌లో రంగారెడ్డిలో 59 కేసులు, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 41 కేసులు మాత్రమే నమోదయ్యాయి. తాజాగా పెరిగిన కేసులు ప్రజల్లో ఆందోళనలు కల్గిస్తున్నాయి.











