దీపావళి పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పండుగకు టపాసులు పేల్చకుండా బ్యాన్ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. పండుగలో క్రాకర్లు కాల్చకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఇంద్ర ప్రకాష్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దీపావళి పండుగకు టపాసులు కాల్చడం ద్వారా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని హైకోర్టు దృష్టికి ఇంద్ర ప్రకాష్ తీసుకెళ్లారు. వీటితో కరోనా రోగులకు ఇబ్బందులు ఎదుర్కొంటారని, కాలుష్యం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి కూడా జరుగుతోందని పేర్కొన్నారు.
పిటిషనర్ వాదనలను విన్న హైకోర్టు టపాసులు అమ్మడం, కొనడం, పేల్చడం బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. టపాసులను అమ్మకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. తెరిచిన టపాసుల షాపులను మూసి వేయాలని సూచించింది. ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు, కోల్‌కత్తా రాష్ట్రాలతోపాటు మరికొన్ని రాష్ట్రాలు టపాసులను బ్యాన్ చేశాయి. కోల్‌కత్తాలో బ్యాన్ చేయకపోతే సుప్రీం కోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. టపాసులు అమ్మడం, కొనుగోలు చేయకూడదని సూచించింది. టపాసులు అమ్మకుండా, కాల్చకుండా ప్రజలకు అవగాహనను కల్పించాలని ప్రభుత్వం సూచించింది. అమ్మకాలు జరిపితే అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో 19వ తేదీన తెలపాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
దీపావళిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది టపాసుల వ్యాపారం చేసేందుకు ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు. కొంతమంది వ్యాపారులు క్రాకర్లను విక్రయించడానికి ముందస్తుగానే తెచ్చి పెట్టుకున్నారు. టపాసులను బ్యాన్ చేయడం వల్ల చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇప్పటికే షాపుల ఏర్పాటుకు కావాలసిన సామాగ్రి, టపాసుల కొనుగోలు చేశారు. ప్రజా ప్రయోజనాల రిత్యా హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతించాల్సిందే కానీ ఈ సీజన్ లో వ్యాపారాలు లేక తమకు ఇబ్బందులు తప్పవని పలువురు వ్యాపారులు వాపోతున్నారు.