వినేందుకు విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఆరేళ్ల క్రితం మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అప్పుల కుప్పలా మారిందన్న మాట వినిపిస్తోంది. ఈ తరహా వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అస్సలు ఒప్పుకోరు. ఖర్చును పెట్టుబడిగా చూడండి అంటూ ఆయన చెప్పే సిద్ధాంతం కొత్త తరహా అనుభవాన్ని ఇస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి.. మిషన్ భగీరధ కావొచ్చు.. రైతు బంధు.. డబుల్ బెడ్రూం.. ఇలా పథకం ఏదైనా కావొచ్చు.. ఖజానా అయితే ఖాళీ అయ్యిందని చెబుతున్నారు.
మూలికే నక్క మీద తాటికాయ
మూలికే నక్క మీద తాటికాయ పడిన చందంగా.. భారీగా చేసిన అప్పులతో కిందామీదా పడుతున్న తెలంగాణ సర్కారుకు కరోనా మహా ఇబ్బందికరంగా మారింది. మామూలుగా వచ్చే ఆదాయం కూడా రాకపోవటంతో.. చేయి తిప్పలేని.. కాలు కదపలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. బడ్జెట్ వేసిన అంచనాలన్ని పక్కకు వెళ్లిపోవటమే కాదు, ఎంత తగ్గించినా.. ఇంకా తగ్గించాలన్న విషయాన్ని అంకెలు చెప్పేస్తున్నాయి. దీంతో లెక్కను ఒక కొలిక్కి తెచ్చేందుకు కిందా మీదా పడుతున్న పరిస్థితి.
ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ రూ.1.82లక్షల కోట్లు. కరోనా కారణంగా ఆదాయం భారీగా తగ్గటంతో దాదాపు రూ.55వేల కోట్లు (ఖచ్ఛితంగా చెప్పాలంటే రూ.52,750 కోట్లు) లోటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. టైం బాగోకపోతే ఈ లోటు మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడంటే అంతా బాగున్నా సెకండ్ వేవ్ మనమీద మళ్లీ విరుచుకుపడితే.. చుక్కలేనని చెప్పక తప్పదు.
ఈ లెక్కన రూ.55 వేల కోట్లను తగ్గిస్తే బడ్జెట్ రూ.1.3లక్షలకు తగ్గుతుంది. పథకాల్ని కాసేపు పక్కన పెట్టేసి.. తప్పనిసరిగా చెల్లించాల్సిన లెక్కల్లోకి వెళితే జీతాలు, పింఛన్ల కోసమే నెలకు రూ.3 వేల కోట్లు అవసరం. ఇప్పటి వరకు తీసుకున్న అప్పులకు చెల్లించాల్సిన వడ్డీ.. తిరిగి చెల్లించే రుణాలు దగ్గర దగ్గర నెలకు రూ.3వేల కోట్లు ఉంటాయి. ఈ రెండింటికే ఈ ఏడాదికి 72 వేల కోట్ల రూపాయిలు అవసరమవుతాయి.
అంటే.. రూ.1.2లక్షల కోట్లలో పైన చెప్పిన రూ.72 వేల కోట్లను తీసేస్తే ఉండేది రూ.50 వేల కోట్లు. అది కూడా అంచనా వేసినట్లుగా ఆదాయం వస్తేనే. అలా రాకుంటే.. మరింత ఇబ్బందే. ఇక, ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన వాటి విషయానికి వస్తే కల్యాణ లక్ష్మీ.. రూపాయికి కిలో బియ్యం.. షాదీ ముబారక్.. ఆరోగ్య శ్రీ.. ఫీజ్ రియంబర్స్ మెంట్ ఇలాంటి వాటి కోసమే దాదాపు రూ11 వేల కోట్లు అవసరం. ఇది కాకుండా భారీ బడ్జెట్ అయిన రైతుబంధు పథకం ఉండనే ఉంది. ఇంకా కనీసం వేయాల్సిన రోడ్లు.. ఇతర ఖర్చులు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉండే పరిస్థితి.
ఆదాయానికి.. పెట్టే ఖర్చుకు ఏ మాత్రం సంబంధం లేదు
ఇదంతా చూస్తే వచ్చే ఆదాయానికి.. పెట్టే ఖర్చుకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పాలి. ఇలాంటి వేళ.. బడ్జెట్ లెక్కల్ని ఎలా సెట్ చేయాలన్నది పెద్ద తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు. ఖర్చుకు కోత వేయటానికి ఎంత పెద్ద కత్తి తీసుకొచ్చినా సాధ్యం కావటం లేదంటున్నారు. మరో వైపు ఆడంబరంగా పథకాల్ని ప్రకటించేయటం.. అందుకు తగ్గట్లు నిధులు లేకపోవటంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి సంపన్న తెలంగాణకు ఇప్పుడో కష్టంగా మారింది. మరి.. ఈ దుస్థితి నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఎలా బయటపడేస్తారన్నది అసలు ప్రశ్న.