తమ రాజకీయ భవిష్యత్తు బాగుండేందుకు ఎవరైనా ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఇష్టపడతారు. ఒకవేళ అధికార పార్టీలో తమ పప్పులు ఏం ఉడకకపోయినా గానీ కొన్ని రోజులు వేచిచూద్దాం మంచి రోజులు మనకు రాకపోతాయా? అనే ఆశలతో ఆ పార్టీలోనే కంటిన్యూ అవుతారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్‌గా కనబడుతోంది. తెలంగాణలో రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ఆ పార్టీని వదిలి బీజేపీ కండువా కప్పుకుంటున్నారు.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల్లో వలసలు జోరందుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి కొందరు.. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి మరికొందరు వలసలు వెళ్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలోకి ఇటీవల చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరికొంత మంది బీజేపీ నాయకులు కూడా పార్టీ మారారు. అయితే తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ, మాజీ బోర్డు సభ్యురాలు అనురాధ, 6వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు బానుక మళ్లికార్జున్, బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు, టీఆర్ఎస్ నాయకుడు బాణాల శ్రీనివాస్‌రెడ్డి మరికొంతమంది నేతలు ఈ రోజు బీజీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అలాగే మైలార్ దేవలపల్లి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాషాయ పార్టీలోకి మారుతున్నట్లు శనివారం ప్రకటించారు. సికింద్రాబాద్లో బహిరంగ సభను ఏర్పాటు చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోం మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో వారు బీజేపీలోకి ఈ రోజు చేరుతున్నారు. మరొకొంత మంది నేతలు కూడా బీజేపీలోకి త్వరలో చేరబోతున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మాజీలకు ఎర…
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను తెలంగాణ బీజేపీ నేతలు టార్గెట్ చేసుకుని ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లతో పాటు పార్టీపై అసంతృప్తితో ఉన్న మరికొంత మంది నేతలపై దృష్టి సారించింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో బీజేపీ బలంగా ఎదిగేందుకు ఈ వలసలను ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను గ్రేటర్ ఎన్నికల్లో ఢీ కొనాలంటే బలమైన ప్రజాభిమానం ఉన్న నేతలను తమ పార్టీలోకి లాగేసుందుకు ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ సీనియర్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డితో పాటు మరి కొంత మంది బలమైన నేతలతో బీజేపీ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ రాజకీయ వలసలు మరింతగా జోరందుకోనున్నాయి.