విజయ్ మాల్యా. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఆయన విడుదల చేసే న్యూఇయర్ క్యాలెండర్ కోసం వీఐపీలు సైతం పోటీ పడేవారు. నేడు విజయమాల్యా పరిస్థితి దారుణంగా తయారైంది. ఎస్బీఐ కన్సార్డియంతో కూడిన 16 బ్యాంకుల నుంచి మాల్యా రూ.12000 కోట్ల అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోయాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ భారీ నష్టాలు రావడంతో ఆ ప్రభావం ఆయన గ్రూపు సామ్రాజ్యంపై పడింది. అప్పులు పెరిగిపోయి తీర్చే మార్గం లేక, అప్పులు తీర్చాలన్న ఆలోచన లేక మాల్యా లండన్ పారిపోయారు. అప్పటి నుంచి ఆయన లండన్ నగర శివారులో ఓ విలాసవంతమైన భవనంలో తలదాచుకుంటున్నాడని తెలుస్తోంది.
కోర్టు ఖర్చులకు కూడా ఆయన వద్ద డబ్బు లేదా?
అప్పులిచ్చిన బ్యాంకులు కోర్టును ఆశ్రయించడంతో మాల్యాకు ప్రాన్స్ లో ఉన్న అత్యాధునిక భవనాన్ని విక్రయించుకునేందుకు అనుమతి లభించింది. దీంతో బ్యాంకులు మాల్యాకు చెందిన విలాసవంతమైన భవనాన్ని వేలం వేశారు. ఆ డబ్బును లండన్ కోర్టు ఫండ్ లో జమ చేశారు. అందులో నుంచి తన కోర్టు ఖర్చులకు వాడుకునేందుకు కొంత మొత్తం ఇవ్వాలని మాల్యా అభ్యర్థించారు. అయితే అందుకు బ్యాంకులు సమ్మతించలేదు. ఆ మొత్తంలో నుంచి మాల్యాకు నగదు ఇస్తే తమ అప్పులు తీరవని వాదించాయి. దీనికి కోర్టు కూడా అంగీకరించింది. దీంతో విలాసవంతమైన భవనం పోయినా మాల్యాకు మాత్రం ఒక్కపైసా ముట్టలేదు.
విల్‌ఫుల్ డిపాల్టర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు 16 బ్యాంకుల నుంచి మాల్యా అందినకాడికి అప్పులు చేశాడు. ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించలేదు. కంపెనీల్లో వచ్చిన లాభాలతో విదేశాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసి కుమారుడు సిద్దార్థ మాల్యా పేరుతో పెట్టాడనే సమాచారం ఉంది. అప్పులు మాల్యా పేరుతో ఆస్తులు మాత్రం కొడుకు పేరుతో రిజిష్టర్ అయి ఉండటంతో మాల్యాను 16 బ్యాంకులు విల్‌ఫుల్ డిఫాల్టర్ గా ప్రకటించాయి. బ్యాంకు అధికారులు కూడా భారీగా లంచాలు మేసి ఆస్తులు చూపకుండానే రుణాలు మంజూరు చేశారని తెలుస్తోంది. విజయమాల్యా కంపెనీల పేరుతో 16 బ్యాంకుల వద్ద నుంచి దొరికినకాడికి దోచి పారిపోతాడని తెలిసినా ఎవరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు లేవు. విజయ్ మాల్యా విదేశాలకు పారిపోకుండా చూడాలని, తీరా అతను లండన్ పారిపోయాక సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఇక ఈడీ కూడా తక్కువ తినలేదు. విజయ్ మాల్యా దేశంలో ఉన్నన్ని రోజులూ నిద్ర నటించిన ఈడీ అధికారులు, ఆయన దేశం విడిచిపారిపోగానే కోర్టును ఆశ్రయించారు. ఇక కాంగ్రెస్, జేడీయూ పార్టీలు మాల్యాను ఏకంగా రాజ్యసభకు పంపిస్తే, బీజేపీ నేతలు మాల్యా విదేశాలకు పారిపోయే దారి చూపారనే విమర్శలు ఉన్నాయి.
ఉద్యోగుల పీఎఫ్ కూడా చెల్లించలేదు
మాల్యా కంపెనీల్లో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగుల పీఎఫ్ కూడా చెల్లించుకుండా ఆ మొత్తాన్ని వారి జీతాల నుంచి కట్ చేసి విదేశాల్లో విలువైన ఆస్తులు కొనుగోలు చేశాడనే విచారణలో బయటపడింది. ఉద్యోగుల వేతనాల నుంచి కట్ చేసిన టీడీఎస్ నిధులు కూడా మాల్యా జాగ్రత్తగా పక్కదారి పట్టించారు. ఇలా బ్యాంకులను ముంచి పారిపోవడం ఎలా అనే విషయంలో మాల్యా పీహెచ్‌డీ చేశారు. మన దేశంలో సామాన్యుడు పదివేల రుణం కావాలంటే బ్యాంకు అధికారులు వంద ప్రశ్నలు వేస్తారు. కానీ మాల్యా ముంబాయిలోని వంద కోట్లు కూడా ఖరీదు చేయని భవనం తాకట్టు పెట్టి రూ.1600 కోట్లు రుణం పొందాడు. ఇలా బ్యాంకుల నుంచి మాల్యా తీసుకున్న అసలు రూ.6000 వేల కోట్లు పైనే. అసలు వడ్డీలు కలపి రూ.12000 కోట్లు దాటిపోయాయి. ఇలా మాల్యా బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఉన్న లోపాలను సొమ్ము చేసుకుని విదేశాలకు పారిపోయాడు. అతణ్ని రప్పించడంకోసం భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు నటిస్తోంది. అడిగో మాల్యాను పట్టుకొస్తున్నాం.. ఇడుగో మాల్యాను బేడీలు వేసి తీసుకువస్తున్నాం… అని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ దొంగలంతా దోచుకుని విదేశాలకు పారిపోయింది మాత్రం బీజేపీ హయాంలోనే అంటే కొందరికి కోపం రావచ్చు. కానీ ఇది పచ్చి నిజం.











