తెలుగుదేశం పార్టీలో కీలక పదవుల్లో ఒకటైన తెలుగుయువత అధక్షపదవి చేపట్టేందుకు ఛరిష్మా కలిగిన యువనేతలు ముందుకు రావడం లేదు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరామ్ లకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. టీడీపీ అధిష్టానం కూడా వీరిలో ఒకటిరికి తెలుగు యువత అధ్యక్షుడి పదవి కట్టబెట్టాలని భావించింది. అయితే ఈ ఇద్దరు నేతలూ తెలుగుయువత అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత చూపలేదు. దీంతో తెలుగుయువత అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టాలో అర్థంకాక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పదవిని కొంత కాలం ఖాళీగా ఉంచాలని నిర్ణయించారని సమాచారం.
తెలుగుయువత అధ్యక్ష పదవి మాకొద్దు….
తెలుగుయువత అధ్యక్ష పదవి చేపడితే రాష్ట్రం మొత్తం పర్యటించాల్సి ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో యువత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఛరిష్మా కలిగిన నేతలు అయితే కార్యక్రమాలకు యువతను ఆకర్షించగలుగుతారని టీడీపీ అధినేత భావించారు. కానీ ఛరిష్మా ఉన్నవారు పదవి చేపట్టడానికి సిద్దంగా లేరు. కింజరావు రామ్మోహన్ నాయుడు ఎంపీ పదవిలో ఉన్నారు. దీనికితోడు పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లోనూ సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీలో టీడీపీకి కీలకంగా పనిచేస్తున్నారు. ఎక్కువ కాలం ఢిల్లీలో ఉండాల్సి వస్తోంది. దీంతో తెలుగుయువత పదవి నిర్వహించడం కష్టమని ఆయన భావించారట. అందుకే అధినేత అడిగినా సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.
ఇక పరిటాల శ్రీరామ్ కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే ప్రస్తుతానికి అనంతపురం జిల్లాకే పరిమితం కావాలని ఆయన భావిస్తున్నారట. రాష్ట్రం మొత్తం తిరిగి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా పరిటాల శ్రీరామ్‌కు భద్రతాపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయి. దీంతో ఆయన వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.
ఆ పదవి నాకివ్వండి ఇరగదీస్తా
తెలుగుయువత అధ్యక్ష పదవి వరించిన వారు మాకొద్దు బాబోయ్ అంటూ ఉంటే, మరికొందరు మాత్రం ఆ పదవి మాకంటే మాకంటూ పోటీ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం తెలుగుయువత అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న బ్రహ్మయ్య తెలుగుయువత అధ్యక్షపదవి తనకిస్తే న్యాయం చేస్తానంటూ పార్టీ పెద్దల వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతానికి పోస్టు ఖాళీనే!
తెలుగుయువత అధ్యక్ష పదవికి అర్హత ఉన్నవారు ఆసక్తి చూపడం లేదు. అర్హత లేని వారు పదవికోసం ఆరాటపడుతున్నారు. దీంతో తెలుగుయువత అధ్యక్ష పదవిని కొంత కాలం ఖాళీగా ఉంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తెలుగుయువత అధ్యక్ష పదవి కట్టబెట్టే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.