ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను ముంబై ఇండియన్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ టీమ్‌లు ఒకే రీతిలో ప్రారంభించాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో చిత్తయిన ముంబై రెండో మ్యాచ్‌లో కోల్‌కతాను ఓడించింది. మూడో మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు పంజాబ్‌ది కూడా అదే కథ. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయిన పంజాబ్.. రెండో మ్యాచ్‌లో బెంగళూరును ఓడించింది. అయితే మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది.
డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన ముంబై టీమ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. ఆటగాళ్లు ఇంకా టచ్‌లోకి రాకపోవడంతో పరాజయాలు ఎదుర్కొంటోంది. ఇక, పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అయితే రెండో మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లోనూ గెలిచే స్థితిలోనే కనిపించింది. అయితే రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ అసమాన ప్రదర్శన కారణంగా ఓటమి పాలైంది. ప్రస్తుతం సమాన స్థితిలో ఉన్న ఈ రెండు టీమ్‌ల మధ్య గురువారం రాత్రి 7:30 గంటలకు షేక్ జావేద్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. మరి, ఈ మ్యాచ్‌లో గెలుపొంది ఎవరు ముందుకు వెళతారో చూడాలి.
ముంబై టీమ్ బలాలు
ముంబై టీమ్‌లో రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్, బుమ్రా, బౌల్ట్, ప్యాటిన్సన్ వంటి అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, కీరన్ పోలార్డ్ అద్భుత పోరాటం చేశారు. భారీ స్కోరును సమం చేయగలిగారు. అయితే సూపర్ ఓవర్లో విఫలమవడం వల్ల ముంబై ఓటమి పాలైంది. మిగిలిన బ్యాట్స్‌మెన్ కూడా టచ్‌లోకి వస్తే ప్రత్యర్థి ఎవరైనా ముంబై టీమ్‌ను ఎదుర్కోవడం కష్టమే అవుతుంది. బౌలింగ్ విభాగంలో బుమ్రా, బౌల్ట్, ప్యాటిన్సన్ వంటి టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నారు.
బలహీనతలు
వ్యక్తిగత ప్రదర్శనలు తప్ప సమష్టిగా రాణించలేకపోవడం ముంబై జట్టు ముఖ్య సమస్య. టీమ్‌లో స్టార్ ఆటగాళ్లున్నప్పటికీ కొందరు ఫామ్‌లో లేకపోవడం ముంబై టీమ్‌ను ఇబ్బంది పెడుతోంది. మిడిలార్డర్ వైఫల్యం ఎక్కువగా ఉంది. అలాగే కీలక ఆటగాడు హార్దిక్ ఇంకా తన మార్క్ చూపించలేదు. అలాగే టాప్ క్లాస్ బౌలర్లున్నప్పటికీ బౌలింగ్ విభాగం అనుకున్న స్థాయిలో రాణించలేకపోతోంది.
ముంబై టీమ్ (అంచనా)
రోహిత్ శర్మ, డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, పోలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, పాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా.
పంజాబ్ జట్టు బలాలు
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. టోర్నీ టాప్ రన్ స్కోరర్ల జాబితాలో ముందు వరసలో ఉన్నారు. ఈ టోర్నీలో రాహుల్ ఇప్పటివరకు 222 పరుగులు, మయాంక్ 221 పరుగులు చేశారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ టీమ్ భారీ స్కోరు సాధించింది. ఏకంగా 223 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో కాట్రెల్ బౌలింగ్‌కు వచ్చే వరకు పంజాబ్‌దే పైచేయిగా కనిపించింది. రాహుల్, మయాంక్ అద్భుత బ్యాటింగ్ కారణంగా తర్వాత వచ్చే వారికి అవకాశాలు రావడం లేదు.
బలహీనతలు
బ్యాటింగ్ విభాగంలో బలంగా కనబడుతున్న పంజాబ్ టీమ్ బౌలింగ్‌లో మాత్రం చాలా బలహీనంగా ఉంది. 223 పరుగులు భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ప్రధాన బౌలర్ కాట్రెల్ బౌలింగ్‌లో రాహుల్ వరుస సిక్స్‌లతో హడలెత్తించాడు. అలాగే మహ్మద్ షమీ, జేమ్స్ నీషమ్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బౌలర్లు లయ అందుకోకుంటే బ్యాట్స్‌మెన్ ఉత్తమ ప్రదర్శన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నాడు.
పంజాబ్ టీమ్ (అంచనా)
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, మ్యాక్స్‌వెల్, పూరన్, నీషమ్, సర్ఫరాజ్ ఖాన్, రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, జోర్దాన్.
మ్యాచ్ ఫేవరెట్:
గత సమీకరణాల పరంగా చూస్తే పంజాబ్ కంటే అన్ని విభాగాల్లోనూ ముంబై జట్టే బలంగా ఉంది. ఈ మ్యాచ్‌లోనూ ముంబైకే విజయావకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే పంజాబ్ టీమ్‌లో రాహుల్, మయాంక్ భీకర ఫామ్‌లో ఉన్నారు. వారు తమ ఫామ్‌ను కొనసాగిస్తే ముంబైకి కష్టాలు తప్పవు. ప్రస్తుతం సమాన స్థితిలో ఉన్న ఈ జట్లలో గురువారం విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.










