తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను రాత్రికి రాత్రి బదిలీ చేశారు. 2017 నుంచి సింఘాల్ టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సింఘాల్ కు ముక్కుసూటి మనిషి అనే పేరుంది. గత మూడేళ్లలో టీటీడీలో అనేక సంస్కరణలు అమలు చేసి భక్తుల ప్రశంసలు అందుకున్న సింఘాల్ ను ఆకస్మికంగా బదిలీ చేయడం వెనుక పెద్ద శక్తులే పనిచేశాయనే అనుమానాలు వస్తున్నాయి.
అసలేం జరిగింది….
ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సమర్పించే వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. దీనిలో సింఘాల్ కు ఎలాంటి సంబంధం లేదు. దీనికి తోడు సీఎం తిరుమల పర్యటనలో మంత్రులు సహా అనేక మంది కరోనా బారినపడ్డారు. సీఎం కార్యక్రమానికి హాజరయ్యే ప్రతీ వ్యక్తి కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.
పరీక్షల్లో నెగటివ్ వస్తేనే సీఎం కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. అలాంటివి ఏమీ పాటించకుండా కరోనా వ్యాప్తికి ఈవో సింఘాల్ నిర్లక్ష్యదోరణి కూడా కారణమని ప్రభుత్వం భావిస్తోందట. అందుకే సింఘాల్ ను బదిలీ చేసినట్టు తెలుస్తోంది.
ఆ డిపాజిట్లపై కన్నేశారా?
తిరుమల శ్రీవారికి కానుకలుగా వచ్చిన రూ.12000 కోట్లు వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఆయా బ్యాంకులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తూ ఉంటాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. మొదటి తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ఏనాడో పోయింది. అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో వైసీపీ పెద్దల కన్ను టీటీడీ డిపాజిట్లపై పడింది. బ్యాంకు ఇచ్చే వడ్డీ కన్నా అరశాతం వడ్డీ అదనంగా చెల్లిస్తామని, ఆ డబ్బు ప్రభుత్వానికి అప్పుగా ఇవ్వాలని టీటీడీని ప్రభుత్వం కోరింది. దీనికి టీటీడీ ఛైర్మన్ సుముఖంగా ఉన్నా, ఈవో సింఘాల్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారని తెలుస్తోంది. అందుకే ఆకస్మికంగా బదిలీ వేటు వేశారని సమాచారం.
టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి
టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డిని నియమిస్తూ సీఎస్..జీవో జారీ చేశారు. ఆరోగ్యశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న జవహర్ రెడ్డిని టీటీడీకి, టీటీడీ ఈవోగా ఉన్న సింఘాల్ ను ఆరోగ్య శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బదిలీలపై అనేక అనుమానాలు వస్తున్నాయి. టీటీడీ నిధులు ప్రభుత్వానికి అప్పుగా బదిలీ చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సింఘాల్ ను అక్కడ నుంచి తప్పిస్తే, పని సులువు అవుతుందని పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది.
సింఘాల్ బీజేపీ మనిషా..
అనిల్ కుమార్ సింఘాల్ మొదటి నుంచీ బీజేపీ మనిషనే పేరుంది. టీడీపీ, బీజేపీ కలసి పనిచేసిన సమయంలోనే ఆయన టీటీడీ ఈవో గా వచ్చారు. బీజేపీ పెద్దల సహాయంతోనే ఆయన టీటీడీ ఈవో అయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తిరుమల వ్యవహారాలు ఎప్పటికప్పుడు కేంద్ర బీజేపీ పెద్దలకు చేరిపోతున్నాయని వైసీపీ భావిస్తోంది. దీనికి సింఘాల్ కారణం కావచ్చని కూడా వారు అనుమానిస్తున్నారు. అందుకే అనిల్ కుమార్ సంఘాల్ ను ఆరోగ్య శాఖకు బదిలీ చేసినట్టు సమాచారం.