టెస్లా… ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నెకగన్న సంస్థ. అంతే కాదండోయ్… ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ ఇది. ఈ కంపెనీ భారత్‌లోకి రంగప్రవేశానికి దాదాపుగా సిద్ధమైపోయింది. అయితే, భారత్‌లోకి ఎంట్రీ అంటే… ఏ రాష్ట్రంలో అడుగు పెట్టాలనే విషయంపై పెద్ద చర్చే జరుగుతుంది కదా. అంతేకాకుండా సదరు కంపెనీకి మన దేశంలోని రాష్ట్రాలు రెడ్ కార్పెట్ పరుస్తున్న విషయం కూడా తెలిసిందే. మల్టీ నేషనల్ కంపెనీల కోసం మన రాష్ట్రాలు సాగిస్తున్న పోటీ కూడా విదితమే. మరి ఈ వాతావరణంలో టెస్లా… కర్ణాటక రాజధాని బెంగళూరులో తన కంపెనీని రిజిస్టర్ చేయించుకుంది. అంటే… ఇతర అన్ని రాష్ట్రాలు పోటీలో ఉన్నా.. కర్ణాటక విజయం సాధించిందన్న మాట. ఈ విషయంలో అసలు ఇది వార్తే కాదు. అసలు వార్తేమిటంటే… ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిద్ర కారణంగా టెస్లా కంపెనీ బెంగళూరు వెళ్లిపోయింది. నిజమా? అంటే… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉండగా… చోటుచేసుకున్న పరిణామాలను చూస్తే ఈ మాట నిజమేనని చెప్పక తప్పదు. టెస్లాను ఏపీకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు తనదైన శైలి మంత్రాంగం నెరపితే.. జగన్ చేజేతులా సదరు కంపెనీని వదిలేసుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ వ్యవహారంలో జరిగిన పరిణామాలు ఏమిటో పరిశీలిస్తే..
2017లో సూచనప్రాయంగా తెలిపిన ఎలాన్ మస్క్
అంతర్జాతీయ స్థాయిలో విద్యుత్ కార్ల తయారీలో పేరుగాంచిన టెస్లా త్వరలోనే భారత్ మార్కెట్లో ప్రవేశించనుంది. దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2017లో సూచనప్రాయంగా తెలిపారు. 2021లో భారత్‌లో తమ ఎంట్రీ ఉంటుందని ఆయన నాడు వెల్లడించారు. అనుకున్నట్లుగానే 2021లో తన కంపెనీని భారత్‌లోకి గ్రాండ్‌గా లాంచ్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో టెస్లాకు సంబంధించిన భారత కార్యకలాపాల రిజిస్ట్రేషన్ చేయించారు. భారత్‌లో జరిగే టెస్లా కార్యకలాపాలన్నీ కూడా ఇకపై బెంగళూరు కేంద్రంగానే జరగనున్నాయి. అంటే… సదరు కంపెనీకి చెందిన భారత ప్రధాన కార్యాలయం బెంగళూరులో త్వరలోనే ఏర్పాటు కానుంది. టెస్లా హెడ్డాఫీస్ బెంగళూరులో అని ఇప్పటికే తేల్చేసినా… సదరు కంపెనీ కార్ల తయారీ యూనిట్ మాత్రం ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై మాత్రం ఎలాన్ మస్క్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అయితే, ఇప్పుడు బెంగళూరులో ఏర్పాటవుతున్న టెస్లా హెడ్డాఫీస్ కూడా ఏపీలో ఏర్పాటు కావాల్సి ఉంది.

అందరికంటే ముందు స్పందించిన చంద్రబాబు
భారత్‌లో టెస్లా ఎంట్రీకి సంబంధించి 2017లో ఎలాన్ మస్క్ నుంచి ప్రకటన వచ్చినంతనే.. నాడు ఏపీ సీఎంగా ఉన్న నారా చంద్రబాబునాయుడు అందరికంటే ముందు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు.. సదరు బృందాన్ని టెస్లాతో చర్చల కోసం పంపారు. సదరు బృందం కూడా చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా టెస్లాతో చర్చలు కూడా జరిపింది. భారత్‌లో ఎంట్రీకి ఇంకా చాలా సమయం ఉందని చెప్పిన టెస్లా… సరైన సమయంలో మరోమారు చర్చలు జరుపుదామంటూ తెలిపింది. ఇంతదాకా బాగానే ఉన్నా… 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కాగా… జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జగన్ సీఎం అయిన నాటి నుంచే… చంద్రబాబు సర్కారు అనుసరించిన వ్యూహాలకు భిన్నంగా సాగడం మొదలెట్టింది. అంతేకాకుండా చంద్రబాబు సర్కారు తీసుకున్న అన్ని నిర్ణయాలను రద్దు చేస్తూ సాగింది. ఈ క్రమంలో టెస్లాతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలను కూడా పక్కన పెట్టేసింది. టెస్లాతో చర్చల విషయాన్ని అధికారులు జగన్ సర్కారుకు చెప్పినా పెద్దగా పట్టించుకున్న దాఖలా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా భారత్‌లోకి టెస్లా ఎంట్రీ సమయంలో ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చింది. ఇదే అదనుగా టెస్లాను తమ రాష్ట్రంలోకి ఆహ్వానించిన కర్ణాటక… పెద్దగా కష్టపడకుండానే ఆ కంపెనీని బెంగళూరుకు ఎగరేసుకెళ్లింది.
అన్ని రాష్ట్రాలు తమదైన శైలి యత్నాలు
అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న కంపెనీలు తమ రాష్ట్రంలోకి ఆహ్వానించే విషయంలో దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు తమదైన శైలి యత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల సీఎంల కంటే కూడా చంద్రబాబు ముందంజలోనే ఉంటారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీ ఏర్పాటే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే హైటెక్ సిటీలో పలు అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీల ఏర్పాటు కూడా ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే టెస్లాను ఏపీకి రప్పించేందుకు చంద్రబాబు యత్నించారు. ఆ దిశగా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే చంద్రబాబు అడుగు వేశారు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుబడుతూ సాగుతున్న జగన్… ఉద్దేశపూర్వకంగానే టెస్లాను వదిలేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే… చంద్రబాబుపై జగన్ పగ… టెస్లాను ఏపీ నుంచి కర్ణాటకకు మరిలిపోయేలా చేసిందన్న మాట. అయినా మించిపోయింది లేదని, కనీసం టెస్లా కార్ల తయారీ యూనిట్ అయినా ఏపీకి వచ్చేలా జగన్ యత్నిస్తే బాగుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.











