ప్రభుత్వ నిర్ణయంతో 4 దశాబ్ధాల ఒంగోలు డెయిరీ చరిత్ర ముగిసిపోయింది. ప్రకాశం జిల్లాలో అమూల్ డెయిరీ కార్యకలాపాలు ప్రారంభించడంతో ఒంగోలు డెయిరీకి వచ్చే పాలు 30 వేల లీటర్ల నుంచి ఒకేసారి 4 వేల లీటర్లకు పడిపోయాయి. దీంతో అధికారులతో కూడిన తాత్కాలిక పాలకమండలి ఛైర్మన్, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఎండీ అహ్మద్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఒంగోలు డెయిరీ ఆస్తులను అమూల్ కు లీజుకిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాడి రైతులు, రైతు సంఘాల నేతలు పెద్ద ఎత్తన వ్యతిరేకించినా, రైతులకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని పాలకమండలి ఛైర్మన్ అహ్మద్ బాబు ప్రకటించారు. కోట్ల రూపాయల విలువైన ఒంగోలు డెయిరీ ఆస్తులను అమూల్‌కు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్దం అవుతున్నట్టు రైతు సంఘాలు ప్రకటించాయి.
ఒంగోలు డెయిరీ ఆస్తులు అమూల్ చేతికి
ఒంగోలు డెయిరీకి చెందిన 30 కోట్ల విలువైన యంత్రసామగ్రిని, పాలపొడి ఫ్యాక్టరీని కూడా అమూల్ డెయిరీకి లీజుకివ్వాలని తాత్కాలిక పాలకమండలి నిర్ణయించింది. ప్రకాశం జిల్లాలో అమూల్ కార్యకలాపాలు ప్రారంభించాక ఒంగోలు డెయిరీకి వస్తున్న పాలు 30 వేల లీటర్ల నుంచి 4 వేల లీటర్లకు పడిపోవడంతో, ప్రస్తుతం వస్తున్న పాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో ఒంగోలు డెయిరీ శాశ్వితంగా మూతపడినట్టయింది. ఒంగోలు డెయిరీని కాపాడుకునేందుకు గత ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయి. ఇందులో రైతుల షేర్ కూడా ఉంది. ఇప్పటికే ఒంగోలు డెయిరీకి కోట్ల విలువైన యంత్రసామాగ్రి, విలువైన స్థలాలు ఉన్నాయి. వాటన్నింటిని లీజు పేరుతో అమూల్ కు కట్టబెట్టడంపై ప్రకాశం జిల్లా రైతులు తీవ్ర నిరసన తెలిపారు. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గేలా లేదు. కేవలం ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాబోయే 3 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమూల్ ను విస్తరించి సహకారరంగంలోని డెయిరీలను దెబ్బతీయాలనే కుట్ర సాగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
డెయిరీ ఆస్తులు ఏం చేస్తారు?
ఒంగోలు డెయిరీ ఆస్తులపై తాత్కాలిక పాలక మండలి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంపై పాడి రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు డెయిరీ ఆస్తులు, యంత్రాలు, పాలపొడి ఫ్యాక్టరీని ఏ ప్రాతిపదికన అమూల్ డెయిరీకి కట్టబెట్టారో చెప్పాలని రైతు సంఘాలు డిమాండ్ చేసినా తాత్కాలిక పాలక మండలి పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి. ఒంగోలు డెయిరీ పాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై కూడా పాలకమండలి స్పష్టత ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కష్టపడి నిర్మించుకున్న సహకార రంగంలోని ఒంగోలు డెయిరీని ముంచి వేసి అమూల్ డెయిరీకి ఆస్తులు కట్టబెట్టడంపై జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని తెలుస్తోంది.
రైతుల మేలు కోసమే…
పాడి రైతులు, ఉద్యోగుల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పాలకమండలి ఛైర్మన్ అహ్మద్ బాబు చెబుతున్నారు. ఇప్పటికే ఒంగోలు డెయిరీ తీవ్ర నష్టాల్లో నడుస్తోందని ఆయన గుర్తుచేశారు. రోజుకు 3.5 లక్షల లీటర్ల కెపాసిటీతో నడవాల్సిన ఒంగోలు డెయిరీకి కేవలం 4 వేల లీటర్ల పాలు మాత్రమే వస్తున్నాయని అహ్మద్ బాబు వెల్లడించారు. ఒంగోలు డెయిరీ ఎంతో కాలం కొనసాగే అవకాశం లేదని, అమూల్ డెయిరీలో కలపడం వల్ల పాడి రైతుల వద్ద సేకరించే పాలకు అధిక ధర చెల్లిస్తుందని అహ్మద్ బాబు భరోసా ఇచ్చారు. అన్ని డెయిరీలకన్నా అమూల్ డెయిరీ లీటరు పాలకు రూ.5 అదనంగా ఇస్తుందని అహ్మద్ బాబు గుర్తుచేశారు. ఒంగోలు డెయిరీని అమూల్ చేతిలో పెట్టడంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా, ప్రభుత్వం మాత్రం రైతుల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.