నాలుగు టెస్టుల సిరీస్ లో భారత జట్టు ఆల్‌రౌండ్ షోతో కదం తొక్కింది. తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకుంటూ ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో టెస్టు ఆడేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ సమయంలో జట్టుకు మరింత బలాన్ని చేకూర్చేందుకు రోహిత్ రంగ ప్రవేశం చేశాడు. ఐపీఎల్‌లో గాయమైన నాటినుంచి పలు మలుపులు, వివాదాలు, డ్రామా, ఫిట్‌నెస్ పరీక్షల అనంతరం రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చిన అతను కఠిన క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సి వచ్చింది. బుధవారం సహచరులతో కలిసి మైదానంలో చలాకీగా కనిపించాడు రోహిత్.
మూడో టెస్టుకు కీలక మార్పులు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ జోరుగా సాగుతోంది. నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో ప్రస్తుతం సమంగా ఉంది. జట్టులోని బెస్ట్ బ్యాట్స్‌మన్ లేడు.. ప్రధాన పేసర్ గాయపడ్డాడు. మరో పేసర్ మధ్యలోనే వైదొలిగినా… మొక్కవోని దీక్షతో రెండో టెస్టులో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. చరిత్రలో ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది. మూడో టెస్టులోనూ ఆసీస్‌పై ఆధిక్యం సాధించాలని రహానెసేన భావిస్తోంది. ఈక్రమంలో జట్టులోకి రోహిత్ రావడంతో కీలకమార్పులు చేసేందుకు వ్యూహ రచన చేస్తోంది.
రోహిత్ ఓపెనరా.. లేక మిడిల్ ఆర్డరా?
సుదీర్ఘ ఫార్మాట్‌లో గొప్ప రికార్డులేమి లేని రోహిత్.. గతేడాది స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఓపెనర్ అవతారమెత్తాడు. శతకాలు సాధించి అన్ని ఫార్మాట్లలో సత్తాచాటగలనని చాటిచెప్పాడు. అయితే అతడు అసలు పరీక్షను ఎదుర్కోలేదు. గాయంతో న్యూజిలాండ్ పర్యటనలో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
ఆ తర్వాత ఐపీఎల్‌లో గాయంతో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని టెస్టు సిరీస్ కోసం ఇప్పుడు జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారిలో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసి హిట్‌మ్యాన్‌కు స్థానం కల్పిస్తారనే వాదనలు వస్తున్నాయి. అంతేగాక ఆటకు చాలా రోజులు దూరమైన అతడు ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తాడని అంటున్నారు.
రోహిత్ వస్తే మయాంక్.. విహారి పరిస్థితి ఏంటి?
రోహిత్‌తో చర్చించిన తర్వాత అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనేది స్పష్టత వస్తుందని టీమిండియా కోచ్ రవిశాస్త్రి తెలిపారు. ఎందుకంటే అతడు గత కొన్ని వారాలుగా క్వారంటైన్‌లోనే ఉన్నాడని అన్నాడు. అయితే ఓపెనర్‌గా రోహిత్ వస్తే మయాంక్ బెంచ్‌కే పరిమితమవుతాడు. అరంగేట్రంలోనే శుభ్‌మన్ గిల్ ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో అతడి స్థానం ఖరారైనట్లే. ఒకవేళ అయిదో స్థానంలో రోహిత్‌తో ఆడించాలనుకుంటే విహారికి నిరాశ తప్పదు. సిడ్నీ వేదికగా జనవరి 7నుంచి భారత్×ఆస్ట్రేలియా మూడో టెస్టు ప్రారంభం కానుంది.











