ఏపీలో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, వాటిని పోస్ట్ చేస్తున్న వారిపై కూటమి సర్కారు కొరఢా ఝుళిపిస్తున్న వేళ… గతంలో వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన కీలక నేత, పార్టీలో నెంబర్ 2 పొజిషనల్ తనదేనంటూ బీరాలు పలికిన నేత వేణుంబాక విజయసాయిరెడ్డి సోసల్ మీడియా వేదికగా చేసిన వికృత క్రీడలను జనం క్రమంగా బయటకు తీస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లను తనకు ఇష్టమొచ్చిన రీతిలో దుర్భాషలాడిన సాయిరెడ్డి… తాను ఓ రాజ్యసభ సభ్యుడినన్న విషయాన్ని కూడా మరిచిపోయి వికృత చేష్టలకు పాల్పడ్డారు. నిజంగానే నాటి సాయిరెడ్డి పోస్టులను చూస్తే… ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్ట్ చేయదలిస్తే… తొలుత సాయిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాతే ఇతరుల జోలికి వెళ్లాలన్న వాదన వినిపిస్తోంది. సాయిరెడ్డి పోస్టులు పరిశీలించిన వారెవరికైనా ఇదే భావన కలగక మానదు.
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీలో సాయిరెడ్డిెకి మరింత ప్రాధాన్యం పెరిగిన సంగతి తెలిసిందే. అప్పటికే వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన… పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగానూ కొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారు. అంతేకాకుండా పార్టీలో జగన్ తర్వాత స్థానం తనదేనంటూ జబ్బలు చరుచుకున్న సాయిరెడ్డి… పార్టీలోని దాదాపుగా అన్ని స్థాయిల నేతలను తన చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. ఇలా పార్లీలో సాయిరెడ్డి వెయిట్ అంతకంతకూ పెరుగుతుండగానే… 2019 ఎన్నికలు రావడం, ఏపీలో వైసీపీకి మెజారిటీ సీట్లు రావడం, ఆ పార్టీ అధికారం చేపట్టడం, పార్లమెంటులో వైసీపీ సభ్యుల సంఖ్య పెరగడం, ఆ సభ్యులందరికీ నాయకత్వం వహించే బాధ్యత తనకే దక్కడం, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇంచార్జీగా కొత్తగా మరో పదవి తనకు తోడవడంతో సాయిరెడ్డి చెలరేగిపోయారు. వైరివర్గాలను సోషల్ మీడియాలో చీల్చిచెండాడేందుకు ఏకంగా ఓ ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసుకున్న సాయిరెడ్డి… నిజంగానే అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోయారు.
టీడీపీ అగ్రనేతలు… ప్రత్యేకించి చంద్రబాబు, లోకేశ్ లను టార్గెట్ చేస్తూ సాగిన సాయిరెడ్డి… తన పోస్టుల్లో ఎక్కడ లేని అసభ్యతను, అశ్లీలాన్ని…ఇంకా చెప్పాలంటూ సదరు పోస్టులు చూస్తేనే ఏవగింపు కలిగే రీతిలో పోస్టులను వదిలే వారు. లోకేశ్ ను అయితే ఇష్టమొచ్చిన అడ్డ పేర్లతో సంబోధిస్తూ సాగిన సాయిరెడ్డి… టీడీపీ యువనేతను అనరాని మాటలన్నారు. ఈ పోస్టులను లోకేశ్ చూశారో, లేదో తెలియదు గానీ… సగటు టీడీపీ అభిమానులు సాయిరెడ్డి పోస్టులను చూసి రగిలిపోయేవారు. టీడీపీ అభిమానులతో పాటు సామాన్య జనం కూడా సాయిరెడ్డి పోస్టుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఓ ఎంపీ స్థానంలో ఉన్న నేత… ఎలాంటి వ్యక్తిగత శతృత్వం లేని… కేవలం రాజకీయపరంగా సైద్ధాంతిక భావజాలంలోనే విబేధాలు కలిగిన కారణంగా లోకేశ్ ను ఇంత మేర దూషిస్తారా? అంటూ జరనల్ పబ్లిక్ సాయిరెడ్డి పోస్టులపై తమదైన శైలి వ్యాఖ్యలు చేసేశారు.
తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో దూషణల పర్వంపై చర్యలు కొనసాగుతున్న వేళ… జనం సాయిరెడ్డి పోస్టులను ఒక్కటొక్కటిగానే బయటపెడుతున్నారు. అది కూడా… నాడు చంద్రబాబు, లోకేశ్ లపై అనరాని మాటలు అని…ఇప్పుడు అసభ్య పోస్టులు చేస్తున్న టీడీపీ నేతలను చర్యలు తీసుకోరా? అంటూ సాయిరెడ్డి ప్రశ్నించినంతనే…జనం ఆయన పాత పోస్టులను బయటకు తీస్తున్నారు. అంతేనా.. సోషల్ మీడియాలో దుర్భాషలతో కూడిన పోస్టుల కారణంగా అరెస్ట్ లు, చట్టపరంగా శిక్షలు వేయాలంటే… ఆ జాబితాలో మొదటి పేరు సాయిరెడ్డిదే ఉంటుందని కూడా జనం చెబుతున్నారు. ఆ మాటలో ఏ మేర నిజముందన్న విషయాన్ని మన కళ్లకు కడుతూ నాటి సాయిరెడ్డి పోస్టులను వారు ఏకంగా షేర్ చేస్తూ సాగుతున్నారు. మరి ఈ పోస్టులను చూసిన తర్వాత సాయిరెడ్డిపై పోలీసులు ఏ తరహా చర్యలు తీసుకుంటారో చూడాలి.