ఏపీలో తొందరపడి పాఠశాలలు తెరవడానికి అసలు కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి లేదని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు చెప్పిందే నిజమనిపిస్తోంది. అందుకే ముందుగా పాఠశాలలు ప్రారంభిస్తే ఎలాగూ కరోనా అంతటా వ్యాపిస్తుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపడం లేదని హైకోర్టు ప్రశ్నించినా, బడులు తెరిస్తేనే లక్షలాది మందికి కరోనా వచ్చింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కరోనా కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని చెప్పవచ్చని ప్లాన్ వేశారట. అందుకే హడావుడిగా బడులు ప్రారంభించి కరోనా వ్యాప్తికి ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఇంత అరాచకమా…
ఏపీలో బడులు తెరవడంతో ఇప్పటికే దాదాపు వెయ్యి మంది ఉపాధ్యాయులు, 700 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కేవలం 9,10 తరగతుల విద్యార్థులకు క్లాసులు ప్రారంభిస్తేనే కరోనా వేగంగా వ్యాపిస్తోంది ఇక వచ్చే రెండు వారాల్లో ఒకటో తరగతి నుంచి అన్నీ తరగతులకు క్లాసులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియ్ తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి.
అయితే ప్రయివేటు విద్యాసంస్థలు నేటికీ ఆన్ లైన్ తరగతుల నిర్వహణకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. బడులు ప్రారంభించి విద్యాసంవత్సరం వేస్ట్ కాకుండా చూడాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా.. కరోనా కట్టడి చేయకుండా బడులు ప్రారంభించడం అంటే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడమేనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వ్యాప్తిలో ఇప్పటికీ ఏపీ దూసుకుపోతూనే ఉంది…
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా…. ఏపీలో మాత్రం నేటికీ రోజుకు 3 వేలకుపైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజుకు 80 వేల కరోనా టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అవి 6 వేలు దాటకపోవచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం కేంద్రం కరోనా టెస్టులకు చేసే సాయం పొందేందుకే రోజుకు 80 వేల టెస్టులు చేస్తున్నామని అధికారులు గణాంకాలు తయారు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కరోనా శాంపిల్స్ తీసుకునే 32 హైమాస్క్ బస్సులను నిలిపివేశారు. ఆ బస్సుల్లో పనిచేసిన కాంట్రాక్టు సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో వారు విధులు బహిష్కరించారు. అయినా ప్రభుత్వం మాత్రం కరోనా అదుపు చేయడంలో ఏపీ దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచామని చెప్పుకుంటోంది.
మరో పది రోజుల్లో బడులు మూసివేతేనా?
కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులను బడులకు పంపేందుకు తల్లిదండ్రులు సాహసించడం లేదు. నేటికీ ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు 50 శాతం దాటలేదు. ఇక మధ్యాహ్న భోజనం తీసుకునే విద్యార్థుల సంఖ్య పది శాతం కూడా లేదని ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ఏడాది విద్యాసంవత్సరంలో హాజరుతో పనిలేదని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అంటే విద్యార్థులు నూరు శాతం హాజరైనా వారితో సామాజిక దూరం పాటించేలా చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోందట. అందుకే సగం మంది వస్తే చాలు అనే ధోరణితో పాఠశాలలు నడుపుతున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో కరోనా వ్యాప్తిపై కేంద్రం కూడా ఆరా తీస్తోందని తెలుస్తోంది. మరో వారం పది రోజుల్లో పాఠశాలలు మూసివేసి, ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేలా కేంద్రం ఆదేశించే అవకాశం లేకపోలేదని పలువురు అంచనా వేస్తున్నారు.











