మల్టీస్టారర్స్ చేయడంలో విక్టరీ వెంకటేశ్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. తన కెరీర్ బిగినింగ్ లోనే అర్జున్, రాజేంద్రప్రసాద్ తో కలిసి ‘త్రిమూర్తులు’ మూవీలో నటించాడు. అలాగే.. రామ్ తో ‘మసాలా’, మహేశ్ బాబు తో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్ కళ్యాణ్ తో ‘గోపాలా గోపాలా’ చిత్రాలు కూడా చేశాడు. బైట హీరోలతోనే అన్ని మల్టీస్టారర్స్ లో నటించినప్పుడు సొంత వారితో చేయకుండా ఉంటాడా? అందుకే లాస్ట్ ఇయర్ మేనల్లుడు నాగచైతన్యతో ‘వెంకీ మామ’ లో నటించి సూపర్ హిట్టు కొట్టాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే తన అన్న కొడుకైన దగ్గుబాటి రానాతో ఓ అదిరిపోయే మల్టీస్టారర్ చేయబోతున్నాడనే న్యూస్ అభిమానుల్ని ఖుషీ చేస్తోంది.
వెంకీ, రానా మల్టీస్టారర్ కు కథ కూడా సిద్ధమైందట. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తోంది. దీనికి తోడు ఈ విషయం పై రానా కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ‘మా ఇద్దరి కాంబినేషన్ లోనూ ఒక సినిమా రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. మా నిరీక్షణ కూడా దానికోసమే. ఇన్నాళ్ళూ ఎలాంటి కథ కోసం చూశామో.. అలాంటి కథ దొరికింది. అన్ని పనులూ పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటిస్తాం’. అంటూ రానా కుండ బద్దలు కొట్టేశాడు. 2021లో సినిమా ప్రారంభం కాబోతోంది. స్ర్కిప్ట్ వర్క్ కూడా ఒక కొలిక్కి వచ్చిందట. త్వరలోనే దర్శకుడి పేరు అనౌన్స్ చేస్తారట. మరి బాబాయ్ అబ్బాయ్ కలిసి ఈ సినిమాతో ఎంత రచ్చచేస్తారో చూడాలి.











