(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లాలో శుక్రవారం నేల బావిలో దూకి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా కుటుంబాలను కబలిస్తోంది… మిగిలిన వారిలో విషాదం నింపుతోంది. కరోనా సోకడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఓ వైపు కరోనా బారిన పడి కుటుంబం నుంచి ముగ్గురు, నలుగురు మరణించిన ఘటనలు చాలానే ఉన్నాయి. మరికొంత మంది కరోనా సోకింది అనే భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరోనా వస్తే ఏదో అయిపోతుందనే భయం ఒక వైపు.. మరోవైపు చుట్టూ ఉన్నావారు.. బంధువులు తమను అంటరాని వారిగా చూస్తున్నారనే మానసిక వేధన మరోవైపు… దీంతో కరోనా సోకిందనే ఆవేదనతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల కరోనా మరణాల కంటే ఇలా ముందే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.
విజయనగరం జిల్లాలో..
విజయనగరం జిల్లాలో శుక్రవారం ఇటువంటి విషాదమే చోటుచేసుకుంది. నేల బావిలో దూకి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.తల్లి, కుమార్తె, అల్లుడు ముగ్గూరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోయిన వారిని తల్లి, ఆమె కుమార్తె సత్యవతి, అల్లుడు సత్యనారాయణ గుప్తాలుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు మృతదేహాలను బయటకు తీశారు. మరో మృత దేహం కోసం గాలిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం .. విజయనగరం జిల్లాలోని వేపాడ మండలం నల్లబెల్లికి చెందిన కుటుంబం.. బ్రతుకు తెరువు కోసం పదేళ్ల కిందటే విశాఖ జిల్లాలోని చోడవరం వెళ్లింది. రెండురోజుల క్రితం తిరిగి స్వగ్రామానికి వచ్చారు. వారికి కరోనా సోకిందనే విషయం తెలిసి స్వగ్రామంలో అవమానాలు ఎదురయ్యాయి. ఎవరూ తమను పట్టించుకోవడం లేదనే మానసిక క్షోభకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో తమవల్ల పిల్లలకు కరోనా సోకుతుందనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
అనుమానాస్పద మృతిగా ..
స్థానికుల నుంచి సమాచారం తీసుకున్న వేపాడ పోలీసులకు వీరిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే రెండు మృత దేహాలను గుర్తించారు. మూడో మృత దేహం కోసం గాలింపు చేపట్టామని.. అయితే ఈ ఆత్మహత్య ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.పూర్తి దర్యాప్తు తరువాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. కరోనా సోకితే ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని.. వేరే ఇతర కారణాలు ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చిన్నారులను వదిలి ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మశక్యంగా లేదని భావిస్తున్నారు. దీంతో కేసును మరింత లోతుగా విచారిస్తామని వేపాడ పోలీసులు చెబుతున్నారు.











