దానం చేయడానికి మంచి మనసుండాలి. సేవ చేయడానికి అతడు మనిషై ఉండాలి. కానీ దాన గుణం, సేవాగుణం కలగలిసిన మంచి మనసున్న మనుషులు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. అందులోనూ ఈ కరోనా కష్టకాలంలో స్వార్ధం అనే మాస్క్ తగిలించుకొన్న కొందరు మనుషుల మధ్య ఆపద్బాంధవులు కూడా ఉంటారని సోనూ సూద్ లాంటి వారు నిరూపిస్తున్నారు. అలాంటి ఓ మంచి మనసున్న మనిషి జీవన్ కుమార్ అనే చిన్న నటుడు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో నటుడిగా తన జెర్నీ ప్రారంభించిన జీవన్.. ఇటీవల బ్లాక్ బస్టరైన జాతిరత్నాలు లోనూ మంచి పాత్ర పోషించాడు.
గతేడాది కరోనా కష్టకాలంలో .. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, భోజనం పంపిణీ చేసిన జీవన్ కుమార్ అండ్ టీమ్ సేవలు ఈ సెకండ్ వేవ్ లోనూ కంటిన్యూ అవుతున్నాయి. ఈ బృందం రోజూ మూడు వందల కరోనా పేషెంట్స్ కడుపు నింపుతున్నారు. భద్రాద్రి గూడెంలోని ట్రైబల్ ఏరియాకి పదివేల కేజీల రైస్ ను పంపిణీ చేశాడు. అలాగే 200 ఆక్సిజన్ సిలెండర్స్ ను అత్యవసర కేసులకు అందించగలిగాడు. ఇంటింటికీ మాస్కులు శానిటైజర్స్ అందించాడు. అతడి సేవలకు ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు ప్రశంసలు తెలుపుతున్నారు. జీవన్ ఇటు సినిమాల్లో నటుడుగా కొనసాగుతూనే .. నిజజీవితంలోనూ హీరోగా నిలుస్తున్నాడు.











