టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సహా జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు భూమి కేటాయించిన వ్యవహారంలో కోర్టు ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యాలయాలకు భూమి కేటాయింపు అంశంలో అధికార దుర్వినియోగంతో పాటు అక్రమాలకు పాలపడ్డారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసీఆర్‌తో పాటు శ్రీనివాస్ రెడ్డి, సీఎస్, సీసీఎల్ఏ, హైదరాబాద్ కలెక్టర్లను ఈ అంశంపై ప్రశ్నించింది.
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో భూమి కేటాయించిన వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆ పార్టీ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూమి కేటాయింపును సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వరరాజు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లో హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాలయానికి భూమి కేటాయింపును కూడా పిటిషనర్ ప్రస్తావించారు. అత్యంత ఖరీదైన భూమిని గజం 100 రూపాయలు చొప్పున ఏకంగా 4 వేల 935 గజాలను టీఆర్ఎస్కు కేటాయించడాన్ని పిటిషనర్ ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కేసీఆర్‌తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.