బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపూత్ మరణంలో సీక్రెట్టేంటో సీబీఐ తేల్చేయనుంది.కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన సీబీఐకి సుప్రీం కోర్ట్ కూడా అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. ఎప్పటి నుంచో ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పు వెలువడగానే ఆయన ‘జయహో సుప్రీం’ అంటూ ట్వీట్ చేశారు.
జూన్ 14న సుశాంత్ సింగ్ ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసును మొదట విచారించిన ముంబై పోలీసులు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో తేల్చారు. కానీ ఆ తరువాత సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ తన కుమారుడి మరణం తరువాత అతని అకౌంట్ లో నుంచి 15 కోట్లు వేరే అకౌంట్ కు ట్రాన్సఫర్ అయ్యాయని ఫిర్యాదు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. కేసును నమోదు చేసుకున్న బీహార్ పోలీసులు ముంబైకి చేరుకొని విచారణ చేపట్టారు.
సుశాంత్ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని ‘మహా’ సర్కార్ చెబుతుండటంతో ముంబై పోలీసులు బీహార్ పోలీసులకు సహకారం అందించలేదు. దీంతో వీరి మధ్య సమన్వయం లోపించింది. కావాలనే ముంబై పోలీసులు ఈ కేసును నీరు గారుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్వాంతత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని బీహార్ ఎంపీ పప్పు యాదవ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ వ్రాశారు. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం ఇప్పటికే సిఫారసు చేసింది. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రం కూడా నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఈ కేసులో మని లాండరింగ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈడీ సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు ట్రాన్సఫర్ అయినట్లు గుర్తించారు.
బందు ప్రీతితో సుశాంత్ సింగ్ కు అవకాశాలు దక్కకుండా చేశారని వస్తున్న వార్తలతో ఇప్పటికే యశ్ రాజ్ సంస్థ అధినేత ఆదిత్యా చోప్రా, ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, మహేష్ భట్ తో పాటు సుశాంత్ కుటుంబ సభ్యులను విచారించారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదురుకుంటున్న మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ పలుమార్లు ప్రశ్నించిన విషయం విదితమే. ఉన్నత న్యాయస్థానం కూడా ఆదేశించడంతో ఈ కేసు వేగవంతం కానుంది.