ఏపీలో పలువురు వైసీపీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ ఎంపీ విజయసాయి రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాష, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కర్నూలు ఎంపీ సంజీవ కుమార్, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు లాంటి ప్రముఖులు ఈ వైరస్ భారిన పడ్డారు.
వైసీపీలో జగన్ తరువాత రెండో స్థానంలో ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డికి కొన్ని రోజుల కిందట ఈ మహమ్మారి సోకింది. జగన్ నాయకత్వంలోని రాష్ట్రం అన్నీ రంగాలలో అబివృద్ది పథాన దూసుకుపోతుందని డంకా భజాయించి చెప్పే ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. ప్రముఖ డాక్టర్ ఆయుష్మాన్ సంజీవ్ కుమార్ 2019లో కర్నూలు లోకసభకు జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. కరోనా మహమ్మారి ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉండటంతో ఆయన ఈ వైరస్ భారిన పడ్డారు. ఆయనతో బాటు ఆయన కుటుంబ సభ్యులకు జరిపిన పరీక్షలలో అందరికీ కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు లేవనో లేక పక్క రాష్ట్రంలో వైద్య వ్యవస్థపై నమ్మకమో ఆయన హైదరాబాద్ లో చికిత్స తీసుకొని కోలుకున్నారు.
డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కూడా కరోనాకు హైదరాబాద్ లోనే చికిత్స తీసుకోవడం గమనార్హం. రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బెంగళూరులో చికిత్స తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేరారు. వీరిలో కొందరు నేతలు పక్కరాష్ట్రంలోకి వెళ్లి కరోనాకు చికిత్స తీసుకున్నారు. ఈ విషయంలోనే ప్రతిపక్షాలు అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. మన రాష్ట్రంలో కరోనా కట్టడికి ఏర్పాట్లు గొప్పగా ఉంటే అధికార పార్టీ నాయకులు పక్కరాష్ట్రంలోకి వెళ్లి చికిత్స తీసుకోవాల్సిన అవసమేముందని వారు ప్రశ్నిస్తున్నారు. వీటిని చూస్తుంటే అల్లు అర్జున్ నటించిన డీజే (దువ్వాడ జగన్నాథం) సినిమాలోని ‘సభ్య సమాజానికి ఏం మెసెజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు’ అనే డైలాగ్ మనకు గుర్తుకు వస్తోంది.
ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రజా ప్రతినిధులు కరోనా సోకితే రాష్ట్రంలోనే చికిత్సలు తీసుకోవాలని కోరినా మెజారిటీ నాయకులు ప్రక్క రాష్ట్రాల వైద్యం కోసం చూస్తుండటం గమనార్హం! రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్నీ ఏర్పాట్లు చేశామని చెబుతున్న ప్రభుత్వం తమ నాయకులు ఎందుకు వేరే రాష్ట్రాలలో చికిత్స తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ప్రభుత్వం చెప్పినట్లు వైద్య వసతులు పక్కాగా ఉండిఉంటే రాష్ట్రంలోనే చికిత్స తీసుకోనేవారనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నాయకులు ఇలా చేయడం వల్ల సామాన్య ప్రజలు రాష్ట్రంలో వైద్య సదుపాయాలపై నమ్మకం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.