అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా పులి పులేరా డోంగ్రే – ఇది ఆ రోజుల్లో చాలా పాపులర్ డైలాగ్. జగత్ జెట్టీలు చిత్రంలో ఎస్వీ రంగారావు నోట పలికిన డైలాగ్ ఇది. కటకటాల రుద్రయ్య సినిమాలో హీరో కృష్ణంరాజు పలికే డైలాగులు కూడా అలానే తూటాల్లా పేలాయి. అలాంటి కృష్ణం రాజు నట వారసుడిగా సినీ రంగప్రవేశం చేసిన ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరో అవుతాడని 2002లో ఎవరూ ఊహించలేదు.
ఆరోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఓ సినిమా ఓపెనింగ్ జరిగింది. మరో నటవారసుడు వస్తున్నాడు అన్నారంతా. హీరో కృష్ణంరాజు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివకుమారి దంపతుల కుమారుడు ప్రభాస్ స్టూడియోలో అడుగుపెట్టగానే అందరూ అన్న మాట.. ‘కుర్రాడు బాగున్నాడు.. మంచి హైటు’ అని. ప్రముఖ నిర్మాత రామానాయుడు మేనల్లుడు అశోక్ కుమార్ నిర్మాతగా ‘ఈశ్వర్’ సినిమా తెరకెక్కింది. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ. అతను మొహానికి మేకప్ వేసుకున్న వేళావిశేషమో, ఈశ్వరేచ్చో తెలియదుగానీ కృష్ణంరాజు పేరు ప్రఖ్యాతులను ప్రభాస్ నిలిపాడు. అక్టోబరు 23 ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రభాస్ వ్యక్తిగా, నటుడిగా ఏమిటో చూద్దాం. ఇటీవలే తన పెదనాన్న కృష్ణంరాజు కన్నుమూయడం ప్రభాస్ జీవితంలో తీరని లోటుగా చెప్పాలి. కానీ కృష్ణంరాజు సంస్మరణ సభను తమ సొంతూరులోనిర్వహించి ప్రజానీకానికి షడ్రశోపేత విందును ఏర్పాటుచేయడంతో ప్రభాస్ ఎలాంటివాడో రుజువైంది.
వివాదాలకు దూరంగా ఉండటం, అభిమానులకు దగ్గరగా ఉండటం ప్రభాస్ నైజం. అతను తెలుగు సినిమా రంగంలో బాహుబలిగా ఎదుగుతాడని ఎవరూ ఊహించలేదు. శంఖంలో పోస్తేనే తీర్థం కాదంటారు. తననటనను రాజమౌళి అనే శంఖంలో పోశాడు.. అందుకే అది తీర్థంగా మారింది. తెలుగు సినిమా స్టామినా గురించి మాట్లాడాల్సి వస్తే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనే మాట వచ్చిందంటే అది అతని సత్తానే. ఆజానుబాహుడు.. అరవింద దళాక్షుడు.. లాంటి పేర్లు అతనికి అతకినట్టు సరిపోతాయి. తొలి సినిమా ఫరవాలేదనిపించినా రెండో సినిమా చూసి అంతా పెదవి విరిచేశారు. ఆ సినిమా ‘రాఘవేంద్ర’. వర్షం సినిమా అప్పట్లో భారీ సినిమాల మధ్య విడుదలైంది. మొదటి రోజు సరైన టాక్ లేదు. బహుశా అంతకుముందు సినిమాల ప్రభావం కావచ్చేమో అనిపించింది.
కానీ నిదానంగా వర్షం కాస్తా పెరిగి పెద్దదై తుపానులా మారింది. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షమే కురిపించింది. ముఖ్యంగా పాటలు ఆ సినిమాని ఓ స్ఠాయిలో లేపేశాయి. హీరోయిన్ త్రిష కూడా ఆ సినిమాకి పెద్ద ఎస్సెట్ గా మారింది. అప్పటిదాకా ప్రభాస్ గురించి ఆలోచించని సినీ జనం మరో మంచి హీరో దొరికేశాడు అనుకున్నారు. అతని ప్రభ అక్కడితో ఆగలేదు.. ‘ఛత్రపతి’లోని శివాజీ పాత్రతో మరో స్టార్ ని చూపించింది. పైగా ఆ సినిమాకి దర్శకుడు రాజమౌళి. అప్పటికి రాజమౌళి మీద కూడా పెద్దగా ఎలాంటి అంచనాలూ లేవు. మళ్లీ ఆ తర్వాత రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మున్నా’ వచ్చాక మళ్లీ ప్రభాస్ ఊపిరిపీల్చుకోగలిగారు. ఆ తర్వాత పూరి జగన్నాధ్ ‘బుజ్జిగాడు’గా ముందుకు తెచ్చారు. ఎన్ని వచ్చినా ‘ఛత్రపతి’ విజయానికి దరిదాపుల్లోకి రాలేకపోయాయి. ‘డార్లింగ్’ సినిమా వచ్చాక ప్రభాస్ అందరికీ డార్లింగ్ గా మారిపోయాడు. ‘మిస్టర్ పెర్ ఫెక్ట్’తో యూత్ మనసుల్లోకి కూడా చేరిపోయాడు. ‘మిర్చి’తో మరచిపోలేని హీరో అయ్యాడు. సక్సెస్ అయిన ప్రతి సినిమా అతన్ని మాస్ హీరోగానే నిలబెట్టాయి. ‘రాధేశ్యామ్’ దాకా అతని 20 సినిమాల ప్రయాణంలో ఒకే ఒక్క సినిమా అతని దిశ, దశలను మార్చేసింది. ఇంతై ఇంతింతై అన్నట్లుగా ఆ ఒక్క సినిమా రెండుగానూ మారింది. రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి ప్రభాస్ ను ప్యాన్ఇండియా స్టార్ ని చేసేసింది.
రాజమౌళితో సినిమా అంటే షూటింగ్ సుదీర్ఘకాలం అని ప్రిపేర్ అయిపోవాలసిందే. ‘సారీ రాజమౌళీ.. నీకోసం నా కెరీర్ ను వదులుకోలేను’ అని ప్రభాస్ అని ఉంటే.. ప్రభాస్ ఏమిటి, రాజమౌళికి సారీ చెప్పడమేంటి అనుకుంటున్నారా? ప్రభాస్ ముందుకు రాజమౌళి తెచ్చిన ‘బాహుబలి’ ప్రపోజల్ అలాంటిదే. 2013లో ఫిబ్రవరిలో ‘మిర్చి’ సినిమా విడుదలైంది. ఆ తర్వాత రాజమౌళికి సినిమా చేయాల్సి ఉంది ప్రభాస్. రాజమౌళి షూటింగ్ అంటే అంతో ఇంతో ఆలస్యం అవుతుందని ప్రభాస్ కు తెలుసు. పైగా బాహుబలికి ఎక్కువ రోజులు కేటాయించాల్సిందిగా కూడా రాజమౌళి అడిగారు. దాదాపు రెండేళ్లపాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇంతకాలం షూటింగా అనుకుని ప్రభాస్ నో చెప్పేసి ఉంటే ‘బాహుబలి’ ప్రభాస్ ఖాతాలోకి వెళ్లి ఉండేదే కాదు.
ఆ సినిమా రెండు భాగాలుగా రూపొందడంతో ప్రభాస్ త్యాగాలకు సిద్ధపడక తప్పింది కాదు. ఈ సినిమా ఒప్పుకుని తప్పు చేశానా? అని ప్రభాస్ షూటింగ్ మధ్యలో అనుకుని కూడా ఉండొచ్చు. కానీ ఆ త్యాగం ఊరికే పోలేదు. ఇప్పుడు ప్రభాస్ ఏ సినిమా చేసినా పాన్ ఇండియా కలర్ వచ్చేస్తోంది. ‘సాహో’లో అంత దమ్ము లేకపోయినా దుమ్ము రేగ్గొట్టింది. భారీ అంచనాలతో విడుదలైన రాధేశ్యామ్ మాత్రం అతన్ని నిరాశలోకి నెట్టేసింది. ప్రస్తుతం ఓంరౌత్ ఆదిపురుష్ తో వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ నీల్ తో సలార్ ఉండనే ఉంది. ఇది పక్కా మాస్ సినిమా. ఇక ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె షూటింగ్ దశలో ఉంది. ఒక విధంగా ప్రభాస్ వేగం పెంచాడనే చెప్పాలి.
మారుతి దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. మారుతి అంటే కామెడీ ఉంటుంది కాబట్టి ఇది ఆ తరహా మూవీ కావడానికే అవకాశం ఎక్కువ. వేరియేషన్స్ కోసమే ప్రభాస్ ఈ సినిమా అంగీకరించి ఉండొచ్చు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథ అంటున్నారు. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఇందులో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమాలు తగ్గించుకోవడం తప్పని ప్రభాస్ నిర్ణయించుకున్నట్టు ఉంది. అందుకే స్పీడ్ పెంచేశాడు.ఇక అతను నటనలోనూ, వ్యక్తిగానూ ఒదిగిపోతూ ముందుకు పోవలసిందే. రేపు పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించి ఇంకెన్ని సర్ ప్రైజ్ లు రాబోతున్నాయో చూడాలి.











