గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలన్ని గెలుపు కోసం తమ వంతు పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే తమకే టికెట్ అనుకున్న అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పేరుకు ఎన్రోల్ మెంట్ ప్రాసెస్ అని చెబుతున్నా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమను గెలిపిస్తే ప్రభుత్వంతో ఎలా పోరాడతాం.. అధికార పార్టీ ప్రజలను పెడుతున్న ఇబ్బందులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నారు. గత ఎమ్మెల్సీ వైఫల్యాలను ఓటర్లే తమకు చెబుతున్నారంటున్నారు అభ్యర్థులు. తమకు మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. పార్టీల పరంగా పోటీ చేసే వారితో పాటు స్వతంత్రులు సైతం వారిక ధీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న సస్పెన్..
వరంగల్ , ఖమ్మం , నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి అధికార టీఆర్ఎస్ ఎవరిని బలపరుస్తుందన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అధినేత మాత్రం పల్లా వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన నియోజకవర్గానికి వెళ్ళినప్పుడల్లా ఎన్రోల్‌మెంట్ ప్రాసెస్‌ను పరిశీలిస్తున్నారు. వీలైనప్పుడల్లా ఓటర్లను సైతం కలుస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నిస్తుండటంతో ఆయనకు నియోజకవర్గంలో తిరగడం కూడా ఇబ్బంది కరంగా మారిందంటున్నారు. అయితే అన్ని పార్టీలు ఫీల్డ్‌లో ఉన్నప్పుడు అధికార పార్టీ నేతలు ఓటర్లను కలవకపోతే తప్పుడు సంకేతం వస్తుందన్న అభిప్రాయంతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అధిష్టానం ఇప్పటి వరకు ఎవరి పేరు ఖరారు చేయకపోవడంతో పార్టీ వర్గాలు సైతం కొంత అయోమయంలో ఉన్నట్టు తెలుస్తోంది.
వ్యక్తిగతంగా పోటీకి ఇష్టం లేకున్నా..
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఇష్టం లేదని ఆ పార్టీ కేడర్ వద్ద పల్లా చెపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ విషయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం ఎమ్మెల్సీ అయిన తరువాత ఆయన పెద్దగా నియోజకవర్గంలో తిరిగింది లేదు… ప్రజలను ,ఓటర్లను కలిసింది లేదు. దీంతో ఇప్పుడు మరోసారి ఓట్ల కోసం వెళ్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు ఆయన సన్ని హితులు చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు పూర్తిగా చదువుకున్న వారే ఉండటంతో , నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల నోటీఫికేషన్ల విషయంలో వారి నుండి ఎదురవుతున్న ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేదంటున్నారు . తనకు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని లేకపోయినప్పటికీ కేసీఆర్ బలవంతంగా ఆ సీటు తనకే ఇస్తున్నట్టు చెబుతున్నారని.. ఆయన బలవంతంతోనే తాను ఎన్నికల బరిలో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థిగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా పోటీ చేసేందుకు అనాసక్తి కనబరస్తుండటంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ బరిలో ఏ మేరకు పోటీ ఇస్తుంది.. నిరుద్యోగులు, గ్యాడ్యుయేట్లు వేసే ప్రశ్నలకు ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.











