మరో ఆరు నెలల్లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం ఒకటి. అయితే ఈ స్థానం నుంచి తెలంగాణ ఉద్యమం సమయంలో అప్పుడు చురుకుగా పాల్గొన్న ఉద్యమకారులు ఎన్నికల్లో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవ్వీళ్లూరుతున్నారు. బరిలో నిలిచే వారిలో దాదాపు అరడజను మంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరాం ఆ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైపోయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ జెఎసి ఛైర్మన్‌గా ఉంటూ అన్ని రాజకీయ పక్షాలను, సంఘాలను, విద్యార్థిలోకాన్ని ముందుండి ఆయన నడిపారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ ప్రత్యేక భూమిక పోషించారు.
అటు చెరుకు..ఇటు మల్లన్న..
అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మరో నేత ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్. ఈయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన వారు. గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఈయన పనిచేశారు. అయితే తనకు తగిన ప్రాధాన్యత ఆ పార్టీలో ఇవ్వడంలేదనే పలు కారణాలతో ఆయన అప్పట్లో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆ తరువాత తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఈయన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే తెలంగాణ ఉద్యమంలో పీడీయాక్ట్ నమోదుతో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు. చెరుకు సుధాకర్ పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అలాగే తీన్మార్ మల్లన్నగా పేరు పొందిన నవీన్ కుమార్ గతంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓటమి పాలయ్యారు.
మేమూ సైతమంటూ..
మేమూ సైతం ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్నామనే సంకేతాలను మరికొంతమంది ఉద్యమకారులు రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణరెడ్డి కూడా ఎమ్మెల్సీ బరిలో నిలిచే అవకాశం లేకపోలేదని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన గతంలో 2014, 2019 ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే యువ తెలంగాణ పార్టీ నాయకురాలు రాణి రుద్రమదేవి పేరు కూడా వినబడుతోంది. ఈమె టీవీ యాంకర్‌గా సుపరిచితురాలు. రాణి రుద్రమదేవి కూడా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. ఆమె గతంలో కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారీ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఉద్యమకారులకు విద్యావంతులు, ఉపాధ్యాయులు సపోర్ట్ చేస్తారని వీరంతా భావిస్తున్నారు.
దేశపతినా? పల్లానా? లేక..
ప్రస్తుతం నల్లగొండ నుంచి టిఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ సారీ జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుడు దేశపతి శ్రీనివాస్‌ను బరిలోకి దించాలని టిఆర్ఎస్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి పల్లా రాజేశ్వర్‌రెడ్డికే అవకాశం ఇచ్చే విషయం కూడా పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బిజెపి పార్టీలు నల్లగొండ స్థానం నుంచి ఉద్యమంలో పాల్గొన్న వారినే బరిలో దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికోసం అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. వచ్చే మార్చిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే నేతలు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికలకు ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. గతంలో ఎన్నడు ఏ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి లేనంత పోటీ ఈసారి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి నెలకొనడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే కోదండరాం బరిలో నిల్చుంటే కొంతమంది ఉద్యమకారులు తప్పుకుని ఆయనకు మద్దతు నిచ్చి బరిలో నుంచి తప్పుకుంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎంతమంది బరిలో నిలిచేది.. బరిలో నిలిచి గెలిచేది ఎవరో వేచి చూడాల్సి ఉంది.