దుబ్బాక ఉప ఎన్నిక పోరు రంజుమీదుంది. గెలుపు కోసం ఎవరికి వారు వ్యూహాలను పన్నుతున్నారు. దీంతో టికెట్ ఆశించి బంగపడ్డవారిని ప్రత్యర్థి పార్టీలు గాలం వేసి లాక్కుంటున్నాయి. ఆయా పార్టీల్లో వలసలు జోరందుకుంటున్నాయి. మొన్న టిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందనుకునేలోపే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు గట్టిషాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతను టిఆర్ఎస్‌లోకి చేర్చుకొని కాంగ్రెస్ పార్టీకి మంత్రి హరీష్‌రావు తనదైన శైలిలో గట్టి షాక్ ఇచ్చారు. ఇలా ఎవరకివారు షాక్‌లిచ్చుకుంటూ ఎన్నికల ప్రచార వ్యూహాల్లో తెరాస, కాంగ్రెస్, బిజెపి పార్టీలో దుబ్బాక ఎన్నికల్లో దుమ్ము లేపుతున్నాయి.
రివేంజ్ తీర్చుకున్న ట్రబుల్ షూటర్..
నవంబర్3న దుబ్బాక ఎలక్షన్లు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. నామినేషన్లకు చివరితేదీ అక్టోబర్ 16, ఉపసంహరణకు చివరి తేదీ 19. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కావడంతో టికెట్ ఆశించి బంగపడినవారికి రాజకీయ పార్టీలు తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. తనకు టిఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి బంగపడ్డ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు నర్సింహారెడ్డి, మనోహర్‌రావులు మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాసలో చేరారు. వందలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చి తెరాసలో చేరడం కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగినట్లే అనుకోవాల్సి ఉంటుంది.
ఈ వలసల ప్రక్రియను తనదైన మార్క్ రాజకీయంతో హరీష్ చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది నేతలు సైతం కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి తెరాసలో చేరనున్నట్లు సమాచారం. బిజెపి నాయకత్వం రఘునందన్‌రావుకు టికెట్ కన్ఫామ్ చేయడంపై బిజెపి నాయకులు కమలాకర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. దీంతో కమలాకర్‌రెడ్డిని బిజెపి పార్టీ నుంచి బహిష్కరించింది. ఇలా టికెట్ ఆశించి బంగపడ్డవారిని తెరాసలో చేర్చుకుని ప్రత్యర్థులను బలహీనపరిచేలా దుబ్బాకలో మంత్రి హరీష్ తనదైన మార్క్ రాజకీయాన్ని నడిపిస్తున్నారు.
ప్రధానంగా ద్విముఖ పోరు..
దుబ్బాక ఉప ఎన్నికల బరిలో టిఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాత, బిజెపి పార్టీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిలుస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా తెరాస, బిజెపి మధ్యనే ప్రధాన పోటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎంపిగా, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర రఘునందన్‌కు ఉంది. అలాగే మొదట నుంచి నియోజకవర్గానికే అంటిపెట్టుకుని ఆయన ఉంటున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు సానుభూతి ఓటు, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనుకూలంగా మారేఅవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రధాన పోటీ తెరాసకు, బిజెపి నడుమ ఉంటుందనే చర్చ జరుగుతోంది.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అసంతృప్తి వాదులు ఒక్కొక్కరు బయట పడుతూ ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు.











