కేసీఆర్ పై నిత్యం విమర్శలు చేస్తూ.. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని తాము ఈసారి అధికారంలోకి వస్తామని చెబుతున్న ప్రతిపక్షాలకు.. ఎన్నికల సమయాల్లో కేసీఆర్ ఇస్తున్న షాక్ లు..ఆ పార్టీలను దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. ఇందుకు ఇప్పుడు వచ్చిన GHMC ఎన్నికలే కాదు.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే జరిగింది. అప్పట్లో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం 2019 ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కేసీఆర్ 2018 సెప్టెంబరు 6న అసెంబ్లీ రద్దు చేసేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు. అంటే దాదాపు 9నెలల ముందు ఎన్నికలు జరిగాయి. అంతేకాదు.. ఏక వ్యాఖ్య తీర్మానంతో అసెంబ్లీ రద్దుకు సిద్ధం కావడం, వెనువెంటనే గవర్నర్ ను కలవడం, మధ్యాహ్నం ప్రెస్ మీట్ లోనే అభ్యర్థులను ప్రకటించడం చేశారు. ఒకే లిస్టుల్లో 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వారిలో కొందరిపై వ్యతిరేకత ఉందని, వారికి ఈసారి TRS టిక్కెట్ల ఇచ్చే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతున్నా..వారికి కూడా టిక్కెట్ ఇచ్చారు. సదరు అభ్యర్థులపై స్థానికంగా ఉండే వ్యతిరేకత కంటే.. కేసీఆర్ పై నమ్మకంతోనే ఓటర్లు ఓటు వేస్తారనే విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రతిపక్షాలను షాక్ కి గురిచేసింది. 9 నెలల ముందు ఎన్నికలు రావడంతో ప్రతిపక్షాలు ఇంకా అభ్యర్థులపై ప్రాథమిక కసరత్తు కూడా చేయలేని పరిస్థితి. కాని కేసీఆర్ అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. మరుసటి రోజునుంచి ప్రచారం ప్రారంభించాలని ఆదేశించారు. మరోవైపు ప్రతిపక్షాలు నామినేషన్ల గడువు ముగిసేటప్పటికి హడావుడిగా అభ్యర్థులను ఎంపిక చేసిన పరిస్థితిని కల్పించారు. పొత్తులు ఉన్నా..చాలా చోట్ల అన్ని పార్టీలూ నామినేషన్లు వేసిన పరిస్థితి కనిపించింది. ఎన్నికల రేసులో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ స్పీడ్ ను అందుకునేందుకు చాలా ప్రయత్నించాయి. కాని ఫలితం లేకుండా పోయింది. ప్రతిపక్షాలు ఓడినందుకు ఉన్న పలు కారణాల్లో ఇది కూడా ఒకటి.
ఈ సారి కూడా టీఆర్ఎస్ అదే వ్యూహం అనుసరించింది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఎన్నికల సంఘ పరిధిలో ఉన్నా.. ఎన్నికల నిర్వహణకు యంత్రాగం సన్నద్దత సర్కారు చేతిలో పని. ఆ మేరకు వ్యూహం అమలుచేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 10వరకు ఉన్నా..
జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకవర్గ గడువు 2021 ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంది. ఈ షెడ్యూల్ కంటే 3 నెలల ముందు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది నవంబరు రెండోవారం తరువాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే దుబ్బాక ఉప ఎన్నికలు రావటంతో పార్టీలన్నీ అటువైపే దృష్టి పెట్టాయి. ఆ ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చెందడం, బీజేపీ విజయం సాధించడంతో ఇప్పటికప్పుడు GHMC ఎన్నికలకు వెళ్లేంత ధైర్యం టీఆర్ఎస్ చేస్తుందా అనే చర్చ కూడా మొదలైంది. అంతే కాకుండా అక్టోబరులో వరదలు రావడం, హైదరాబాద్ లోని పలు కాలనీలు మునగడం, ముంపు బాధితులు పరిహారం కోసం ఇంకా పోరాటాలు చేస్తుండడం, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నిలదీయడం జరగుతున్న టైంలో ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని భావించారు. కాని కేసీఆర్ సర్కారు ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది.
ముందస్తుగానే సిద్ధం..
షెడ్యూల్తో సంబంధం లేకుండా గ్రేటర్ ఎన్నికల కోసం పార్టీ ఇన్చార్జీల నియామకం చేసింది. చాలావరకు సిట్టింగ్ కార్పొరేటర్లనే బరిలోకి దింపేందుకు సిద్ధమైంది. క్షేత్ర స్థాయిలో అంతా సిద్ధమైపోయింది. ప్రస్తుతం GHMCలో 99మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ వారే ఉన్నారు. వారిలో 80 మంది వరకు మళ్లీ పోటీచేయనన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారిని సన్నద్ధంగా ఉండాలని ముందుగానే పార్టీ ఆదేశించింది. షెడ్యూల్ రావడం ఆలస్యం.. త్వరగా ప్రచారంలో దింపేందుకు పార్టీ సిద్ధమైంది. కాని అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. కాని ప్రతిపక్షాలు ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే ఉన్నాయి. చివరి నిమిషంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న టీఆర్ఎస్.. ప్రతిపక్షాలకు మరో షాక్ ఇస్తుందని కూడా చెబుతున్నారు.
షెడ్యూల్ కి నోటిఫికేషన్ కి..ఒక్క రోజే
ఎన్నికల షెడ్యూల్ కి, నోటిఫికేషన్ కి మధ్య ఒక్కరోజు మాత్రమే వ్యవధి ఉంది. మంగళవారం షెడ్యూల్ విడుదల కాగా నోటిఫికేషన్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కూడా ప్రతిపక్షాలకు కొంత ఇబ్బందే. నోటిఫికేషన్ జారీకి, ఎన్నికలకు మధ్య 14రోజులు మాత్రమే టైం ఉంది. ఈ టైంలో ప్రతిపక్షాలు అభ్యర్థుల్ని ఖరారు చేయడం, ప్రచారం చేయడం చేసుకోవాలి. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పూర్తిగా ప్రచారం చేయవచ్చు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చినట్టే.. GHMC ఎన్నికల్లోనూ నామినేషన్లకు మూడురోజులే గడువు ఇవ్వడంతో ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంమీద ప్రతిపక్షాలను టీఆర్ఎస్ ‘టైం’ చూసి దెబ్బ కొట్టే వ్యూహం అమలుచేసిందని చెప్పవచ్చు.











