కోవిడ్ అన్ లాక్ ప్రక్రియ చాలా రోజుల క్రితమే మొదలైనప్పటికీ సినిమా థియేటర్లు మాత్రం ఇంకా తెరచుకోలేదు. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం థియేటర్లను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 50 శాతం సీటింగ్ తో తెరచుకోవచ్చునని ఆదేశాలు ఇచ్చింది. అయితే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉందని తేల్చి చెప్పింది. కరోనా మరింత విజృంభిస్తుందేమోనని తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు తెరచుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు తెరచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో కొన్ని థియేటర్లను తిరిగి ప్రారంబించారు.
తెలుగు సినిమా ఏదైనా రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల కావాలని ఏ నిర్మాతైనా కోరుకుంటారు. ఆలా కాకుండా ఒక్క తెలుగు రాష్ట్రంలోనే విడుదల చేస్తే వసూళ్లు సరిగా రాక సదరు నిర్మాత, నష్టపోవాల్సి వస్తుంది.. ఈ కారణంగానే కొత్త సినిమాలు విడుదల కావడం లేదు. దాంతో ఆంధ్ర ప్రదేశ్ లో కొద్ది థియేటర్లను మాత్రమే ఓపెన్ చేశారు. వాటిలో ఇప్పుడు పాత సినిమాలనే వేస్తుండటంతో ప్రేక్షకులు అంతగా రావడం లేదు. కొత్త సినిమాలు విడుదలైతే నిబంధనలకు అనుగుణంగా మంచి కల్లెక్షన్లు వస్తాయని పరిశ్రమలో వినిపిస్తోంది.
ఇది ఇలావుండగా…ఇటీవల చిరంజీవి, నాగార్జున తదితరులు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలసి చిత్ర పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. అందుకు కేసీఆర్ కూడా స్పందిస్తూ, చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పిన విషయం తెలిసిందే. అదే సందర్భంలో తెలంగాణాలో సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతులు ఇవ్వబోతున్నట్లు సీఎం స్పష్టం చేశారు కూడా. అయితే ఇంతవరకు జీవో రాకపోవడంతో నిర్మాతలు తమ కొత్త సినిమాలను థియేటర్లలో విడుదల చేసే విషయంలో ఏం చేయాలో పాలుపోక ఎదురుచూస్తున్నారు.
Also Read ;- ఓటీటీలో మరో క్రేజీ మూవీ
పక్క రాష్ట్రం ఏపీతో పాటు తమిళనాడు, ఇంకా దేశంలోని 18 రాష్ట్రాలలో థియేటర్లు ఓపెన్ చేసినా తెలంగాణాలో మాత్రం తెరచుకోలేదని చిత్రపరిశ్రమలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా ప్రముఖులైన నలుగురైదుగురు థియేటర్ల లీజుదారులు పైరవీలు చేస్తూ థియేటర్లు ఓపెన్ కాకుండా అడ్డుకుంటున్నారని కొందరు నిర్మాతలు బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారు.
పండగ సినిమాలతో ప్రేక్షకులు థియేటర్లకు బాగా వస్తారని, ఈ లోపు అంతగా రారన్న ఉద్దేశ్యంతోనే తాము ఎక్కడ ఓనర్లకు లీజు ఎక్కడ చెల్లించాల్సి వస్తుందోనని లీజుదారులు వేస్తున్న పన్నాగమే ఇదని పరిశ్రమలో కొందరు అంటున్నారు. మరోవైపు తెలంగాణ థియేటర్ల జీవో ఏరోజైనా ప్రభుత్వం విడుదల చేయవచ్చునని కొందరు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఆశావాదంతో వున్నారు. బహుశా డిసెంబర్ 7 లేదా 11 నుంచి థియేటర్లు తెరచుకునే అవకాశం లేకపోలేదని పరిశ్రమలో వినిపిస్తోంది.
Must Read ;- థియేటర్లలో సినిమా ఎప్పుడు చూపిస్తారు మామా?