ఏ హీరో అయినా ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పాత్రలు కొన్ని ఉంటాయి. అందులో నక్సలైట్ కేరెక్టర్ ఒకటి. గతంలో ‘సిందూరం, ఓసేయ్ రాములమ్మ, అడవిలో అన్న’ లాంటి సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఇక పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి గురించి చెప్పనే అక్కర్లేదు. ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’, ‘ఎర్రసైన్యం, చీమలదండు, అడవి దివిటీలు’ లాంటి ఇంకా ఎన్నో సినిమాలన్నీ అప్పట్లో భలేగా పే చేశాయి. ఇక పవర్ స్టార్ జల్సాలో ఆయన ఫ్లాష్ బ్యాక్ ను చెప్పే క్రమంలో , అలాగే ప్రకాష్ రాజ్ ను మొదటిసారిగా కలుసుకొనే క్రమంలోనూ పవన్ నక్సలైట్ గా కాసేపు కనిస్తారు. అలాగే ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన ‘పీపుల్స్ ఎన్ కౌంటర్’ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఇక ఈ తరం ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకోడానికి.. త్వరలో ఇద్దరు స్టార్ హీరోలు నక్సలిజం బాట పడుతున్నారు. వారెవరో కాదు.. రానా, రామ్ చరణ్. అయితే ఈ రెండు సినిమాలూ రెండు డిఫరెంట్ కాలానికి సంబంధించిన సినిమాలు కావడం విశేషం. 1992 లో తెలంగాణా ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల్ని బేస్ చేసుకొని యువ దర్శకుడు వేణు ఊడుగుల ‘విరాట పర్వం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రానా, ప్రియమణి, సాయిపల్లవి లాంటి స్టార్స్ తో పాటు .. జాతీయ స్థాయి నటీమణి నందితాదాస్ సైతం నక్స లైట్స్ గా నటిస్తున్నారు. ఈ గ్యాంగ్ అప్పట్లో ఒక మిషన్ నిమిత్తం .. అడవుల్లో గుట్టుగా దాగాల్సి వచ్చింది. అప్పుడు జరిగిన ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే ఈ సినిమా.
నిజానికి ఇదొక ఎమోషనల్ డ్రామా. పోలీసుల నుండి తమ ఉనికిని కాపాడుకోడానికి ఈ నక్సలైట్ల బృందం సాగించిన అరణ్య వాసం ఈ సినిమా కథాంశం. ఇందులో సాయిపల్లవి, ప్రియమణి పాత్రలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే .. ప్రస్తుతం తండ్రి చిరంజీవి హీరోగా అతడు నిర్మిస్తోన్న ‘ఆచార్య’ సినిమాలో చెర్రీ అతిథి పాత్రలో ఓ 30 నిమిషాల పాటు కనిపిస్తాడట. ఆ ఎపిసోడ్ లో చరణ్ పవర్ ఫుల్ నక్సలైట్ గా నటించనున్నడని తెలుస్తోంది.
అంతేకాదు ఇందులో అతడి పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండనుందట. అదే సమయంలో ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్ లో అతడి నట విశ్వరూపాన్ని చూపించనున్నాడట. ఈ ఎపిసోడ్ సినిమాకే కీలకంగా ఉండనుందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్య.. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. మరి నక్సలైట్స్ గా వస్తోన్న రానా, రామ్ చరణ్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.











