ఈ ఏడాది అక్టోబర్ 31న యావత్తు దేశం నరకాసుర వధను పురస్కరించుకుని దీపావళిని ఘనంగా జరుపుకుంటోంది. సరిగ్గా గతేడాది ఇదే రోజున ఏపీలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. స్కిల్ డెవలప్ మెంట్ పథకంలో అవినీతికి పాల్పడ్డారంటూ అరెస్టైన నాటి విపక్ష నేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు సరిగ్గా అక్టోబర్ 31ననే జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సందర్భంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడ సమీపంలోని ఉండవల్లి వరకు రోడ్లపై జన జాతర కనిపించింది. ఈ జన జాతర ఏ అరగంటో, గంటో కాకుండా…ఏకంగా కొన్ని గంటల పాటుగా అలాగే రోడ్లపై.. ప్రత్యేకించి జాతీయ రహదారిపై అలా నిలిచిపోయింది. జైలు నుంచి విడుదలైన చంద్రబాబుకు అభివాదం తెలుపుతూ పార్టీలకు అతీతంగా జనం నీరాజనాలు పలికారు. ఆనాడు కనిపించిన దృశ్యాలు జనంలో జగన్ సర్కారు పట్ల ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టాయి. ఆ వ్యతిరేకత అలాగే పెరిగిపోయి… 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పాలనకు చరమ గీతం పాడటంతో పాటుగా అన్యాయంగా జైలు జీవితం గడిపిన చంద్రబాబుకు తిరిగి పాలనా బాధ్యతలను అప్పగించింది.
2019-24 వరకు సాగిన వైసీపీ పాలన సాంతం అరాచకంగానే సాగిందని ఇప్పుడు జనానికంతా అర్థమైపోయింది. జగన్ సీఎంగా ఉందగా తాను తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు జనానికి తెలియకుండా జాగ్రత్త పడినా… ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక…ఇటీవలే నాటి చీకటి జీవోలన్నీ బహిర్గతం అయిపోయాయి. ఫలితంగా జగన్ పాలన ఏ రీతిన జరిగిందన్న దానిపై జనానికి ఓ స్పష్టమైన అవగాహన వచ్చింది. అప్పటికే జగన్ పాలన అరాచకమని చాలామంద నమ్మినా…కొందరిలో ఎక్కడో జగన్ మంచే చేస్తున్నారని నమ్మారు. అయితే చీకటి జీవోలు బహిర్గతమయ్యాక…ఇలాంటి వారిలోనూ జగన్ పాలన పట్ల స్పస్టత వచ్చిందనే చెప్పాలి. అసలు జగన్ పార్టీకి 11 సీట్లు రావడానికి కూడా వైసీపీ అరాచక పాలననేని చెప్పక తప్పదు. నాటి అరాచక పాలనను అంతమొందించేందుకు సరిగ్గా చంద్రబాబు రిలీజ్ రోజే బీజం పడిందని చెప్పక తప్పదు.
స్కిల్ డెవలప్ మెంట్ పథకం కింద రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాలు పెంపొందించాలని నాటి టీడీపీ సర్కారు భావించింది. అందుకోసం తగిన చర్యలూ చేపట్టింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ… ఈ పథకంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా పక్కా ఆధారాలు సేకరించకుండానే చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ నేతను అరెస్ట్ చేసింది. పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకునే నిమిత్తం నంద్యాలలో ఉన్న చంద్రబాబును అక్కడే అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు ఆయనను నేరుగా విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ కేసు విచారణను చేపట్టిన కోర్టు… చంద్రబాబుకు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. తాము కోరుకున్న మేరకే కోర్టు ఆదేశాలు జారీ చేసిందంటూ చంకలు గుద్దుకున్న వైసీపీ సర్కారు,… ఆ రోజు రాత్రే రాజమహేంద్రవరం జైలుకు తరలించింది.
చంద్రబాబు అరెస్ట్ తమను ఏ మేర ముంచుతుందన్న విషయాన్ని నాడు వైసీపీ గుర్తించలేకపోయింది. అసలు ఆ దిశగా ఆ పార్టీ ఆలోచన చేయనే లేదు. అయితే ఆ చర్య ప్రభావం ఎలా ఉంటుందన్న విషయం మాత్రం చంద్రబాబు రిలీజైన రోజున జగన్ సర్కారు కళ్లారా చూసిందనే చెప్పాలి. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి చంద్రబాబు రిలీజ్ అవుతున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు చంద్రబాబుకు మద్దతుగా రోడ్ల మీదకు వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తన కాన్వాయ్ ఎక్కి విజయవాడకు బయలుదేరగా… రాజమహేంద్రవరం వీధుల్లో జనం తన కోసం నిలబడ్డ తీరు చూసి స్థాణువైపోయారు. అలా ఆ జనానికి అభివాదం చేస్తూ సాగిన చంద్రబాబు… రాజమహేంద్రవరం దాటేందుకు గంటల సమయం పట్టింది. ఇక అక్కడినుంచి జాతీయ రహదారి పొడువునా జనం నిలిచిన తీరు టీడీపీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయనే చెప్పాలి. ఎందుకంటే… అలా జాతీయ రహదారి వెంట నిలిచింది కేవలం టీడీపీ శ్రేణులు మాత్రమే కాదు… ఆ పార్టీ శ్రేణులకు నాలుగైదు రెట్ల మేర సామాన్య ప్రజానీకం. ఆ జనమంతా చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని తలచుకుని మరీ ఆయనకు సంఘీభావం తెలిపేందుకే రోడ్లపైకి వచ్చారు. ఆ సమయంలోనే జగనాసుర పాలనకు చరమగీతం పాడాలన్న ప్రజా తీర్పునకు అంకురార్పణ జరిగింది.