మీకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి అయినప్పటికీ.. ఆయన దయాదాక్షిణ్యాల మీద పదవులు అనుభవిస్తున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. సాక్షి రిపోర్టరు మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుద్దుందా లేదా అంటూ విరుచుకుపడ్డారు. ఇదేదో ప్రెవేటుగా ఒక గదిలో జరిగిన వ్యవహారం కాదు. తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల.. మిగిలిన అందరు మీడియా సభ్యుల ఎదుటే జరిగింది. కెమెరా రికార్డ్ చేస్తుండగానే జరిగింది. ఇంతకీ సొంత పత్రిక సాక్షికి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపోర్టరు మీద.. వైవీ సుబ్బారెడ్డి అంత ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేసినట్టు?
అసలేం జరిగింది..?
తిరుమలలో సేంద్రియ పదార్థాలు, గో ఆధారిత ఉత్పత్తులతోనే తయారుచేసిన వంటకాలతో ప్రత్యేకమైన భోజనం వడ్డించేలా అన్నమయ్య భవన్ లో ఉండే క్యాంటీన్ లో అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంప్రదాయ భోజనం అని పేరు పెట్టి.. రూ.200 ధర పెట్టారు. రోజుకు 200 మందికి మాత్రమే అని నియమం పెట్టుకున్నారు. అది ప్రజాదరణ పొందింది. ఈలోగా.. హఠాత్తుగా తిరుమలకు వచ్చిన ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ‘‘పాలకమండలి లేని సమయంలో అధికారులు ఈ సంప్రదాయ భోజంన గురించి నిర్ణయం తీసుకున్నారని, దీనికి టికెట్ పెట్టడం వల్ల త్వరలోనే టీటీడీ నిత్యాన్నదానం కూడా ఎత్తివేస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోందని’’ తనంత తానుగా ప్రకటించేసి, కనీసం ఏ ఒక్క అధికారితోనూ సంప్రదింపులు కూడా జరపకుండానే.. సంప్రదాయ భోజంన తొలగిస్తున్నట్టు ప్రకటించారు. పాలకమండలి తో సంబంధం లేకుండా, అధికారులు సొంతంగా ఒక నిర్ణయం తీసుకున్నందుకే ఈగోకు పోయి, ఇలా దాన్ని ఆపుచేయించారని అంతా అనుకున్నారు.
మరింత మంట పుట్టింది
అయితే ఈ సందర్భంగా.. దాన్ని రద్దు చేస్తున్న ప్రకటనకు ముందు.. ఆలయంలో దర్శనం తర్వాత.. వైవీ బయటకు రాగానే.. సాక్షి టీవీ విలేకరి ఫేస్ 2 ఫేస్ ఇంటర్వ్యూ చేశారు. అందులో భాగంగా.. సంప్రదాయ భోజనం పథకం అద్భుతంగా హిట్టయింది కదా.. దానిమీద మీ స్పందన ఏంటి? అని వైవీని అడిగారు. అప్పటికే.. తన పర్మిషన్ లేకుండా ఆ పథకం పెట్టారని ఆగ్రహంతో మంచి కాక మీద ఉన్న వైవీ.. ఆ కోపాన్నంతా సాక్షి రిపోర్టరుపై చూపించారు. ‘‘నీకు బుద్ధుందా లేదా.. అది హిట్టయిందని ఎవరు చెప్పారు..’’ అంటూ రంకెలువేశారు. సొంత టీవీ చానెల్ విలేకరిమీదనే రంకెలు వేస్తుండేసరికి చూస్తున్న వారంతా అప్పటికి ఆయన ఆగ్రహానికి కారణం తెలీక బిత్తరపోయారు. ఆ తర్వాత.. ప్రెస్ మీట్ లో, ఆయన సంప్రదాయ భోజన పథకాన్ని టోటల్ గా రద్దు చేసి పారేయడం గమనార్హం.