నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని, దీనితో నాటి సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సామాజిక వర్గానికి చెందిన వారు భారీ ఎత్తున లబ్ధి పొందారని ఏపీ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన నాడే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని తేలిపోయింది. ఇదేదో జగన్ ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు చెప్పిన మాట కాదు.. సాక్షాత్తు ఈ కేసును విచారిస్తున్న ఏపీ హైకోర్టు స్పష్టం చేసిన మాట. ఇందులో భాగంగా చంద్రబాబు హయాంలో అడ్వొకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులపై జగన్ సర్కారు నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు గురువారం సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో జగన్ అండ్ కో రెండున్నరేళ్లుగా బలవంతంగా ఆడిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ అట్టర్ ప్లాఫ్ అయ్యిందన్న సెటైర్లు పేలుతున్నాయి.
దమ్మాలపాటిపై కేసులు ఇవే
అడ్వొకేట్ జనరల్ హోదాలో ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్.. చంద్రబాబు సర్కారు నుంచి అమరావతికి సంబంధించి అధికారిక ప్రకటన రాకముందే.. విషయం తెలుసుకుని ఆమరావతి పరిధిలో భారీ ఎత్తున తక్కువ ధరకు భూములు కొన్నారట. ఇందులో భాగంగా తన పేరిట, తన కుటుంబ సభ్యుల పేరిట తక్కువ ధరలకే భూములు కొన్న దమ్మాలపాటి.. తన బంధువర్గంతోనూ భూములు కొనిపించారట. ఈ ఆరోపణలతోనే దమ్మాలపాటి, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువుల్లో పలువురిపై ఇన్ సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న సెక్షన్ల కింద జగన్ సర్కారు కేసులు నమోదు చేసింది. అంతటితో ఆగకుండా ఏకంగా సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి కుటుంబం కూడా దమ్మాలపాటి మాదిరే అమరావతిలో భూములు కొనుగోలు చేశారని కూడా జగన్ సర్కారు సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఫిర్యాదు చేసింది. తనపై నమోదైన కేసులపై దమ్మాలపాటి హైకోర్టును ఆశ్రయించగా.. జగన్ సర్కారుకు షాకిస్తూ హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్లు విడుదలయ్యాయి. అంతేకాకుండా ఈ కేసులో దర్యాప్తును నిలుపుదల చేస్తూ కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టుకు జగన్ సర్కారు
హైకోర్టు ఉత్తర్వులతో షాక్ తిన్న జగన్ సర్కారు.. దమ్మాలపాటిపై నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు చేపట్టాల్సిందేనన్న కోణంలో సాగింది. అందులో భాగంగా ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్ సర్కారు.. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టేయాలని కోరింది. అయితే బాధితులే లేకుండా, బాధితుల నుంచి ఫిర్యాదులు లేకుండా.. అసలు నష్టం ఎవరికి జరిగింతో తెలియకుండా కేసులు ఎలా నమోదు చేస్తారంటూ సంచలన ప్రశ్నలు వేసింది. ఈ విషయంపై జగన్ సర్కారు నీళ్లు నమలగా.. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఇక వాదనలు వినిపించడం కష్టమని భావించిన జగన్ సర్కారు పిటిషన్ ఉపసంహరించుకుంది. ఆ సమయంలో ఈ కేసును నెల రోజుల్లోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టుకు దిశానిర్దేశం చేసింది. ఆ మేరకు విచారణ జరిపిన హైకోర్టు ఆధారాల్లేని కారణంగా దమ్మాలపాటిపై నమోదు చేసిన కేసులన్నింటినీ కొట్టివేస్తున్నట్లుగా సంచలన తీర్పు చెప్పింది. వెరసి జగన్ ఆరోపణలు సత్యదూరమని తేలిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.