తిరుమలేశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించే విషయంలో.. తిరుమల పరిపాలన బాధ్యతలు చూసే ఉన్నత స్థాయి అధికారులు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయా? కొత్త కార్యనిర్వహణాధికారి పాలన పీఠం మీదికి అడుగు పెట్టీ పెట్టగానే.. ఇవి కాస్తా బయటపడుతున్నాయా? అనేది స్థానికంగా చర్చనీయాంశంగా ఉంది.
కొవిడ్ నేపథ్యంలో తిరుమలేశుని ఆలయాన్ని మార్చిలోనే మూసివేశారు. కొవిడ్ ఉధృతి తగ్గిందని భావించిన తర్వాత.. తిరిగి తెరిచారు గానీ.. చాలా పరిమితంగా మాత్రమే భక్తులను అనుమతిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. బ్రహ్మోత్సవాలను ఎప్పటిలాగా మాడవీధుల్లో నిర్వహిస్తే.. భక్తుల ఉధృతిని, జనసమూహాల్ని నియంత్రించడం చాలా కష్టసాధ్యం అని అధికారులు భావించారు. అప్పట్లో అనిల్ కుమార్ సింఘాల్ కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. దాంతో ఆగమ నిపుణులతో కూడా చర్చించి.. స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంలో ఆలయంలోపల మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయంలోని రంగనాయకమండపంలోనే వేడుకలన్నీ జరిగాయి.
మామూలుగా ఈ ఏడాది నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసేవరకు కూడా సింఘాల్ ఈవోగా ఉంటారని అంతా అనుకున్నారు గానీ.. వేర్వేరు పరిస్థితుల నేపథ్యంలో.. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియగానే ఆయనను బదిలీచేశారు. ఆ స్థానంలో జవహర్ రెడ్డిని కొత్త ఈవోగా ప్రభుత్వం నియమించింది. ఈ మధ్యలోనే ఒక తమాషా చోటుచేసుకుంది.
జవహర్ రెడ్డిని కొత్త ఈవోగా నియమించబోతున్నట్టు కర్ణాకర్ణిగా వినిపించినప్పటికీ.. అధికారిక ప్రకటన రావడానికి పూర్వం- తిరుమల జేఈవో ధర్మారెడ్డిని ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు చూసుకోవాలని ప్రకటించారు. ధర్మారెడ్డి- ఎంతో కాలంగా జగన్మోహనరెడ్డికి సన్నిహితులు అనే ప్రచారం ఉంది. ఆయన ఈవోగా స్వల్పకాలానికి పగ్గాలు చేతపట్టారు. ఏదో ఆపద్ధర్మంగాి నాలుగు రోజులు బాధ్యతలు చూసుకునేదానికి ఆయన ఏకంగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి.. 16వ తేదీనుంచి జరగాల్సి ఉనం్న నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏ రకంగా నిర్వహించాలో నిర్ణయించారు. సాలకట్ల ఉత్సవాల్లాగా, ఆలయంలో ఏకాంతంగా నిర్వహించడం కాకుండా.. ఎప్పటిలాగానే మాడవీధుల్లో వైభవోపేతంగా నిర్వహించాలని తీర్మానించారు. కాకపోతే.. భక్తులను మాడవీధుల్లోకి చాలా పరిమితంగా మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఆ మేరకు మాడవీధుల్లో భక్తులు కూర్చునేందుకు వీలుగా నిర్మించిన గ్యాలరీల్లో సామాజిక దూరం, ఎడం ఉండేలా మార్కింగులు కూడా చేయించారు. భజన బృందాలు సాంస్కృతిక బృందాలను కూడా పరిమిత సంఖ్యలో పిలిపించి ఉత్సవాలు నిర్వహించాలని అనుకున్నారు. నిజానికి ఇలా జనసమూహాలతో, రద్దీ మధ్య ఉత్సవాలు నిర్వహించడం.. ఏపీలో కొవిడ్ ఉధృతి ప్రమాదకరమైన సంకేతాలు పంపుతున్న తరుణంలో కరెక్టు కాకపోయినప్పటికీ.. ధర్మారెడ్డి నేతృత్వంలో నిర్ణయం జరిగిపోయింది.. ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
ఈలోగా జవహర్ రెడ్డి కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయన కూడా సమీక్షించారు. భక్తులకు ఇబ్బంది రాకుండా మాడవీధుల్లో చేసిన ఏర్పాట్లను కూడా పరిశీలించారు. అంతా అయిన తర్వాత.. మాడవీధుల్లో నిర్వహణ విషయంలో సంకోచించారు. వెనక్కు తగ్గారు. సెప్టెంబరులో నిర్వహించిన తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా.. ఏకాంతంలోనే ఆలయంలోపల నిర్వహించాలని.. జవహర్ రెడ్డి నిర్ణయించారు.
దీంతో ఉత్సవాల విషయంలో ధర్మారెడ్డి ప్రదర్శించిన దూకుడుకు జవహర్ రెడ్డి ముందుజాగ్రత్తగా బ్రేకులు వేసినట్లుగా అయింది. ఏదో వారం రోజులు ఇన్చార్జి గా ఈవో బాధ్యతలు నిర్వహించే అవకాశం వస్తే.. కొవిడ్ ప్రమాదావకాశవాల్ని లెక్కచేయకుండా.. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు అభాసుపాలు కావాల్సి వచ్చిందని పలువురు అనుకుంటున్నారు.











