తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆస్తి నష్టాన్నే కాదు ప్రాణ నష్టాన్ని కూడా మిగులుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నంలో జరిగిన ఓ ఘటన ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. 60 ఏళ్ల మహిళ తన కుమారుడు, కోడళు, కారు డ్రైవర్‌తో కలిసి కారులో తిరుపతికి వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు నర్సిపట్నంలో వరదకు కొట్టుకుపోయింది. దీంతో ఉమామహేశ్వరీ అనే 60 ఏళ్ల మహిళ మృతిచెందింది. అయితే ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 6.30 గంటలకు జరిగినట్లు తెలిసింది. దొంగ గడ్డ బ్రిడ్జి దాటుతుండగా ఒక్క సారీ వరద ఉదృతి పెరగడంతో ఆ ప్రవాహానికి కారు కోట్టుకుపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ఉమామహేశ్వరీతో పాటు తన కుమారుడు, కోడలు, డ్రైవర్ నర్సిపట్నం నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్నారు. దొంగ గడ్డ బ్రిడ్జిని దాటుతున్న క్రమంలో వరద ఉదృతి పెరిగి నీళ్లల్లో కారు కొట్టుకుపోయింది. ఉమామహేశ్వరీ మినహా మిగతా అందరూ కారు నుంచి క్షేమంగా బయటపడ్డారు. కానీ ఉమా మహేశ్వరీ మాత్రం మరణించింది. ఆ కారు అలా కొట్టుకుపోయి చెట్టుకు చిక్కుకొని ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు.











