అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాను బ్యాన్ చేయడమంటే మామూలు విషయం కాదు.. తేడా వస్తే..కంపెనీ పరిస్థితి అటో ఇటో అవ్వడమే.. అలాంటి నిర్ణయం తీసుకునే విషయంలో పరిస్థితులను అంచనా వేయాలి. ఎదురు కానున్న సవాళ్లను ఎదుర్కొనే స్థైర్యం, సబ్జెక్ట్, సమయస్ఫూర్తి.. ఇవన్నీ కావాలి. వీటన్నిటినీ ఎదుర్కొని ట్రంప్ ట్విట్టర్ ఖాతాను బ్యాన్ చేసిన నిర్ణయం వెనుక.. తెలుగు అమ్మాయి ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆమె పేరు మారుమోగుతోంది. ఆమె పేరే.. విజయ గద్దె. మూడేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులతో అమెరికా వెళ్లిన ఆమె పుట్టింది హైదరాబాద్‌లోనే. ఆమె పూర్వికులు కృష్ణా జిల్లా దివిసీమకు చెందిన వారని తెలుస్తోంది. విజయ గద్దె ప్రస్తుతం ట్విట్టర్ లీగల్, పాలసీ, సేఫ్టీ విభాగ హెడ్‌గా ఉన్నారు. దీంతోపాటు గార్డంట్ హెల్త్, మెర్సీ కార్ప్స్ ట్రస్టీగా, హ్యాష్‌టాగ్ ఫౌండింగ్ పార్టనర్‌గా ఉన్నారు.
చరిత్రలో మొదటిసారి..
అమెరికా అధ్యక్ష చరిత్రలో.. ఒక మీడియా సంస్థగాని, ఒక వ్యవస్థ గాని, ఒక విభాగం కాని..అధ్యక్షుడి ప్రకటనని, ప్రెస్ మీట్‌లను, ఆయన ప్రసంగాలను, భావ వ్యక్తీకరణను.. ఇలా బ్యాన్ చేసిన నిర్ణయం తీసుకోలేదు. చరిత్రలో మొదటిసారి ప్రపంచం అగ్రదేశ అధ్యక్షుడి భావవ్యక్తీకరణను తమ వేదికపై బ్యాన్ చేసే నిర్ణయం తీసుకున్నారు గద్దె విజయ. అంతేకాదు ట్రంప్ ట్విట్టర్‌లోని ప్రతి పదాన్ని పరిశీలించి, న్యాయపరమైన అంశాలను చూసుకుని..నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆమె చెప్పిన ఒకే ఒక మాట..యావత్ ప్రపంచాన్ని, అమెరికన్లను ఆలోచింప జేసింది. ఆ ట్వీట్ వల్ల అమెరికా గౌరవం పోయే ప్రమాదం తలెత్తింది. హింసను ప్రేరేపించే ఉద్దేశం కనిపిస్తోంది. అందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్యానించారు.
విద్యాభ్యాసం..
మూడేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులతో అమెరికా వెళ్లారు. టెక్సాస్‌లోనే పెరిగారు విజయ. విజయ తండ్రి కెమికల్ ఇంజనీర్‌గా మెక్సికో గల్ఫ్ ఆయిల్ రిఫైనరీలో పని చేసేవారు. విజయ న్యూజెర్సీలో హైస్కూల్ చదువు పూర్తి చేశారు. కార్నెల్ విశ్వవిద్యాలయం, న్యూయార్క్ యూనివర్సిటీ లా స్కూల్‌లో పట్టా అందుకున్నారు. జునిపర్ నెట్ వర్క్స్‌లో న్యాయపరమైన సేవలందించారు. తరువాత సిలికాన్ వ్యాలీలో విల్సన్ సోన్సిని గుడ్ రిచ్ అండ్ రొసాటితో పాటు న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ ప్రోక్సీలో కౌన్సెల్ కమిటీగా చురుగ్గా వ్యవహరించారు. 2011లో ట్విట్టర్ కంపెనీలో చేరారు. తరువాతే ట్విట్టర్ న్యాయపరమైన, చట్టపరమైన ఇబ్బందులను అధిగమించిందని చెబుతారు.
ప్రభావవంతమైన మహిళ..
విజయ గద్దె.. 2014లో ఫార్చ్యూన్ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళ. గతంలో ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ ట్రంప్‌తో, మోదీ జరిపిన సమావేశాల్లోనూ విజయ పాల్గొన్నారంటే.. ట్విట్టర్‌లో విజయ ప్రాధాన్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
మహిళా సాధికారికతకు ప్రాధాన్యం..
ట్విట్టర్‌లో విజయ గద్దె సేవల విషయం పక్కన బెడితే.. ఆమె మహిళా సాధికారికతకు, సమాన వేతనం కోసం పోరాడే సంస్థల ఏర్పాటుతో ముందుంటున్నారు. అందులో భాగంగా స్టార్టప్ కంపెనీలూ ప్రారంభించారు. ఇన్‌స్టైయిల్ మేగజైన్ అత్యంత శక్తివంతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిగా కీర్తించింది. మహిళా సమస్యలపై పోరాడేందుకు గాను.. `ఏంజెల్స్` కో ఫౌండర్‌గా విజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా మహిళలు స్థాపించే స్టార్టప్‌లకు పెట్టుబడుల సాయంతో పాటు, కంపెనీల్లో పురుషులతో పాటు సమాన వేతనాల కోసం కృషి చేస్తున్నారు. సౌదీలో మహిళల కోసం పోరాడుతున్న లాజైన్‌కు మద్దతుగా ట్వీట్ కూడా చేశారు. అయితే ఆమెపై అక్కడి ప్రభుత్వం ఉగ్రవాద ముద్ర వేసింది. ఆమెపై ఉగ్రవాద ముద్ర వేయడం, అవే అంశాలతో విచారణ జరుపుతుండడంపై గతంలో చాలా విమర్శలు వచ్చాయి.
టర్కీపై పోరు..
ట్విట్టర్‌ని టర్కీ బ్యాన్ చేసిన సమయంలో న్యాయపోరాటానికి దిగారు. టర్కీలోనే న్యాయపోరాటం చేసి కొన్నివిజయాలు సాధించిన వ్యక్తిగా పేరుంది. 90మంది లీగల్ టీంని నడిపించే విజయ గద్దె..సక్సెస్ రేటు కూడా ఎక్కువే అని చెబుతారు.
ఒక్క చైనాలోనే ఇలా..
కాగా విజయ గద్దెపై చైనాలో మాత్రం సానుకూలత కనిపించలేదు. అక్కడి చాలా తక్కువ కథనాలు మీడియాలో విజయపై వచ్చాయి. అందుకు కారణం ఒక్కటే. గతంలో భారత్ వచ్చినప్పుడు విజయ దలైలామాను కలిశారు. అంతకాదు.. దలైలామా చేయి పట్టుకుని మరీ ఫొటో దిగారు. ట్విట్టర్ సీఈఓతో కలిసి..దలైలామా పక్కనే నిలబడిన విజయ సాధారణంగానే చైనాకు గిట్టని వ్యక్తి. ఎందుకంటే..టిబెట్ విషయంలోగాని, లామాతో కలిసే విషయంలో..ఏ చిన్న సానుకూల అంశం కనిపించినా.. వారితో ఫొటోలు దిగినా..అది చైనాకు నచ్చని విషయమని తెలిసిందే
సంప్రదాయలను మర్చిపోకుండా..
చిన్నతనంలోనే అమెరికా వెళ్లిన విజయ గద్దె..తన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మాత్రం మర్చిపోలేదు. అందేకాదు.. తెలుగు పండుగలు ఘనంగా నిర్వహించుకునే విజయ గద్దె..తన కుమార్తెకు పెట్టిన పేరు.. లీలా అన్నపూర్ణ హోమ్సెని. ఈమె భర్త.. రామ్ సే హోమ్సెని..ప్రస్తుతం ఆక్టెంట్ బియో సంస్థను నిర్వహిస్తున్నారు. గతంలో డ్రాప్ బాక్స్, గూగుల్, షేర్ థాట్ బోర్డుల్లో పని చేశారు.