రామ్ కథానాయకుడిగా రూపొందిన ‘రెడ్’ సినిమా, సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్రవంతి రవికిశోర్ నిర్మించారు. రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయన సరసన నివేదా పేతురాజ్ – మాళవిక శర్మ కథానాయికలుగా అలరించనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో సందడిగా జరిగింది. నివేదా పేతురాజ్ – మాళవిక శర్మ ఇద్దరూ కూడా వేదికపై అందంగా మెరిశారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ .. “ఈ సినిమాకి అసలైన హీరో మా పెదనాన్నే. ఎందుకంటే ఈ సినిమాను థియేటర్స్ కి తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడన్నది నేను చూశాను. కరోనా తగ్గితే తమ పిల్లలను బయటికి పంపిద్దామని పేరెంట్స్ ఎలా ఎదురుచూస్తారో, కరోనా తగ్గితే ఈ సినిమాను థియేటర్స్ కి పంపిద్దామని ఆయన అంతలా ఎదురుచూశారు. అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనే ఆయన పట్టుదలే, ఈ రోజున ఇంతటి సందడికి కారణమైంది.
ఇక రామ్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడని అంతా అంటూ ఉంటారు. నా ఎనర్జీ నాలోనిది కాదు .. అది మీ ఎనర్జీ. మీరు కొట్టే చప్పట్లు .. వేసే విజిల్స్ నాలో అంతటి ఎనర్జీని పెంచుతాయి. ‘హలోగురు ప్రేమకోసమే’ సినిమా షూటింగు సమయంలో నాకు విపరీతమైన ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ ను కూడా లెక్క చేయకుండా నేను డాన్స్ చేయడానికి కారణం .. మీరే. హీరోగా నా ప్రయాణం మొదలై 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంతకాలంగా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అంటూ రామ్ అభిమానుల సమక్షంలో ఈ వేదికపై కేక్ కట్ చేశాడు.
Must Read ;- త్రివిక్రమ్ తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రామ్