ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండోసారి కూడా కలవబోతున్నారు. ఇందులో పెద్ద వింతేముందని అనుకుంటున్నారా..? ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రిని కలవడంలో ఆశ్చర్యం ఏముందని అనుకుంటున్నారా..? నిజమే ఇందులో ఆశ్చర్యం లేదు. కాని ఒక సందేహం మాత్రం ఉంది.
గతంలో పలువార్లు, హోం మంత్రిని కలిసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రిని కలిసేందుకు అమిత్ షా ఎందుకో ఉత్సాహం చూపించలేదు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి హోం మంత్రిని కలవకుండానే వెనుతిరిగిన సందర్భాలు రెండుకంటే ఎక్కువే ఉన్నాయి.
పలుపర్యటనల్లో ఒక్క భేటీ కూడా జరగకుండా వచ్చిన జగన్, ఈసారి ఒక పర్యటనలోనే రెండుసార్లు కలుస్తున్నారు. ఇది జాతీయ స్ధాయిలో చర్చనీయాశం అవుతోంది. ఇంతకు ముందు కలిసేందుకు అవకాశం ఇవ్వని హోం మంత్రి ఇప్పుడు రెండుసార్లు కలవడంపై అంతరార్థం ఏమిటని ప్రశ్నలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ఇతర అంశాలపై హిందూ సంస్ధలు గుర్రుగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కాసింత కరుణ చూపిస్తోంది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు లోలోన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘దేశా’న్నికొట్టడమే లక్ష్యమా…!?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నారా అని జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, క్రింది స్ధాయి నాయకులు ఆ పార్టీని వదిలి అధికార వైఎస్.ఆర్ పార్టీలో చేరుతున్నారు.
మరోవైపు బీజేపీ కూడా కాపులు, బీసీ కులాలకు చెందిన వారిని తెలుగుదేశం పార్టీకి దూరం చేసే పనిలో పడింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు చూస్తే అధికార వైఎస్.ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఏకమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమను ప్రత్యేక హోదా విషయంలో అనేక ఇబ్బందులు పెట్టిన విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ.. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను రెండుసార్లు కలుస్తున్నట్లుగా చెబుతున్నారు.
హోం మంత్రి అక్షింతలు వేసారా…?
తనను కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హోం మంత్రి అమిత్ షా మందలించారంటూ జాతీయ, తెలుగు మీడియాలో వార్తలు వచ్చాయి. కోర్టులపై అధికార వైఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు సమంజసం కాదంటూ హోం మంత్రి అమిత్ షా అక్షింతలు వేసినట్లు చెబుతున్నారు. న్యాయస్ధానాలపై వ్యాఖ్యనించే సమయంలో ఆచి తూచి వ్యవహరించాలని హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హితవు పలికినట్లు చెబుతున్నారు. నిజానికి ఈ వార్తలకు ఎలాంటి నిర్ధరణ లేదు. కరెక్టో కాదో తెలియదు. ఒకవేళ అమిత్ షా , జగన్ వైఖరిని తప్పుపట్టినదే గనుక నిజమై ఉంటే.. వాటి గురించి తన సంజాయిషీ చెప్పుకోడానికి జగన్ రెండోసారి హోం మంత్రిని కలుస్తుండవచ్చునని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.











