ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో తెలియకా, తీవ్ర ఒత్తిడికిలోనై చనిపోతున్నట్లు ఓ యువకుడి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువకుడు ఆ వీడియోలో ఏం చెప్పాడంటే…
‘కెసిఆర్ సార్.. నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో తెలియక, ప్రైవేట్ ఉద్యోగ్యం చేయలేక తీవ్ర ఒత్తిడికి లోనై చచ్చిపోతున్నం సార్. నేను చనిపోవడానికి కారణం అదే సార్. చదివి చదివి మైండ్ ఇదై పోయింది సార్. పుస్తకం తీస్తే షివరింగ్ వస్తుంది సార్. 20 రోజుల నుండి మనిషిని కాలేక ధైర్యంగా చనిపోవాలని డిసైడయ్యాను సార్. ప్లీజ్ సార్..నోటిఫికేషన్లు వేయండి. మాలాంటి ఎంతో మంది నిరుద్యోగులకు నమ్మకం కలిగించండి సార్. నిరుద్యోగులు ఏమైపోవాలి సార్. అమ్మా నన్ను క్షమించు. అమ్మా, నాన్నా, అన్నా ఎవరూ పోలీస్ కంప్లయింట్ ఇవ్వకండి. స్మశానానికి తీసుకెళ్లండి. స్నేహితులు నన్ను క్షమించండి.‘ అనే సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ యువకుడు నల్గొండ జిల్లా మిరాయలగూడ పట్టణం అశోక్ నగర్ కు చెందిన సంపత్ అని తెలిసింది. రెండు రోజుల క్రితం ఆ యువకుడు విషం తాగి సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తెలిసింది.
నిరుద్యోగులకు నమ్మకాన్నివ్వండి….
ఆత్మహత్యాయత్నానికి ముందు సంపత్ తీసుకున్న సెల్ఫీ వీడియో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికినీ అది సోషల్ మీడియాలో ఆదివారం చక్కర్లు కొట్టింది. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుకు ఈ వీడియో నిదర్శనంగా మారిందని పలువురు ఆరోపించారు. తన సెల్ఫీ వీడియోలో సంపత్ నాలుగైదేళ్లకోసారి నోటిఫికేషన్ ఇస్తున్నారు.. ఆరు నెలల్లోనే వాటిని కంప్లీట్ చేయాలని సూచించాడు. మొన్న వీఆర్వోలను రద్దు చేశారు. వాళ్లను మళ్లీ సర్దుబాటు చేస్తామంటున్నారు. పాతవాళ్లనే సర్దుబాటు చేస్తుంటే తమలాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏమవ్వాలని సంపత్ ప్రశ్నించాడు. ‘సీఎం సార్.. నిరుద్యోగులకు నమ్మకాన్ని ఇవ్వండని’ ఆయన వీడియోలో కోరారు. ప్రస్తుతం సంపత్కు మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నట్లు సమాచారం.
సారుపై విద్యార్థలు గుస్సా…
నోటిఫికేషన్లు రాక, ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అడపాదడపా నోటిఫికేషన్లను ప్రభుత్వం వేస్తున్నప్పటికినీ ఆలస్యం కారణంగా ఉద్యోగ నియామక ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఏళ్లకు ఏళ్లు ఉద్యోగాల కోసం చదివి..చదివి నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేయలేక మానసికంగా కుంగిపోతున్నారు. దీంతో సంపత్ లాంటి వారు కొంతమంది ఆత్మ హత్యలకు పాల్పడుతున్న పరిస్థతి ఉంది. పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి అప్పుసప్పు చేసి హాస్టళ్లలో, అద్దె రూమ్ లలో ఉంటూ వివిధ ఉద్యోగ నియామక పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. నోటిఫికేషన్లలో జాప్యం కారణంగా ఏళ్ల తరబడి ఇలా అద్దె రూమ్ లలో ఉంటూ చదవడం నిరుద్యోగులకు భారంగా తయారవుతోంది.
కరోనా ముందు వరకు వేలాది మంది నిరుద్యోగులు అశోక్ నగర్, ఆర్టిసి క్రాస్ రోడ్, దిల్ సుఖ్ నగర్, అమీర్ పేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ప్రిపేరయ్యేవారు. కరోనా కారణంగా పరిస్థితి అంతా ఇప్పుడు మారిపోయింది. చదివిన సదువు కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఈ కరోనా కారణంగా నోటిఫికేషన్లు ఎప్పుడొస్తయో అనే భావన నిరుద్యోగుల్లో ఉంది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన విద్యార్థి లోకం ఉద్యోగాల విషయంలో ‘ సారు‘పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటవెంటనే వేసి తమకు ఉద్యోగాలను కల్పించాలని, భతుకుపై భరోసా కల్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.










