జ్యోతిష శాస్ర్తంలో రాహుకేతువుల పేరు వినగానే అందరూ వణికిపోతారు. ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే పాత నేరస్తుల మీదికే పోలీసుల దృష్టి పోయినట్లు వ్యక్తుల జీవితాల్లో ఏంజరిగినా రాహుకేతువులకే అందరూ మొదట అంటగడతారు. ఆ విషయాలను విశ్లేషించుకునే ముందు ఈ నెల 23వ తేదీ జ్యోతిష శాస్ర్తపరంగా విశేషమైన రోజు. ఈ రోజు రాహుకేతువులు రాశులు మారుతున్నారు. దాదాపు ఏడెనిమిది నెలలుగా కరోనా భయపెట్టడానికి కారణం రాహుకేతువులే అని కూడా చాలామంది నమ్ముతున్నారు. రాహుకేతువుల రాశి మార్పు ప్రతి 18 నెలలకు ఒకసారి జరుగుతుంది. గత ఏడాదిన్నర కాలంగా రాహువు మిధునంలో, కేతువు ధనుస్సులో ఉన్నారు. వాళ్ళు మళ్లీ తిరిగి అదే రాశిలోకి రావడానికి 18 సంవత్సరాలు పడుతుంది.
ఎప్పుడు మారుతున్నారు?
ఈ సెప్టెంబరు 23 వ తేదీ ఉదయం 8.22 గంటలకు ఈ రాశుల మార్పు జరుగుతుంది. నవగ్రహాలలో ఈ రెండు గ్రహాలు మాత్రమే వ్యతిరేక దిశలో తిరుగుతాయి. పైగా ఇవి గ్రహాలు కావు.. ఛాయా గ్రహాలు మాత్రమే. కానీ గ్రహాల కన్నాచాలా అధికంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయని జ్యోతిష శాస్ర్తం చెబుతోంది. రాహువు మిధునం నుంచి వృషభంలోకి వెళతాడు. కేతువు ధనుస్సు నుంచి వృశ్చికానికి వెళతాడు. అక్కడ 2022 ఏప్రిల్ 12వ తేదీ మధ్యాహ్నం 11.18 గంటల వరకూ ఆ రాశుల్లో ఉంటారు. ఈ మార్పు ఫలితాలు ఆయా వ్యక్తుల వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రాహుకేతువులపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు వాటికి వృషభం, వృశ్చికంలను ఉచ్ఛ, నీచ స్థానాలుగా చెబుతుంటారు. మరికొందరు వాటికి ఉచ్చనీచాలు ఉండవంటారు. ఈ రాహుకేతువులు రాశులు మారితే కరోనా నుంచి జనం ఊపిరి పీల్చుకోవచ్చని అనేక మంది జ్యోతిష పండితులు చెబుతున్నారు.
రాహుకేతువుల ప్రత్యేకత ఏమిటి?
రాహుకేతువులు చాలా శక్తిమంతమైన గ్రహాలు. రాహువును తలగానూ, కేతువును తోకగానూ భావిస్తుంటారు. తలకు కోరికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని ప్రధాన లక్షణం మాయగా చెబుతారు. అత్యాశ, ఊహలులాంటి వన్నీ రాహువుకు సంబంధించిన లక్షణాలే. ఇక కేతువు తోక కాబట్టి ఆయనకు అంతశక్తి ఉండదని మాత్రం అనుకోవద్దు. ఆయన లక్షణాలు ఏమిటంటే వైరాగ్యం, మోక్షం, విముక్తి… ఇలా ఉంటాయి కేతువు లక్షణాలు. వ్యక్తుల జాతకాల విషయంలో తమకున్న లక్షణాలను బట్టే ఇవి దెబ్బతీస్తుంటాయి. రాహుకేతువులు ఇప్పుడున్న రాశుల కాలంలో కాలసర్పదోషం కూడా వచ్చింది.
అంటే నవగ్రహాలలో మిగతా ఏడు గ్రహాలు రాహుకేతువుల మధ్య ఇరుక్కుని ఉండటంతోపాటు గత ఏడాది ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండటం జరిగింది. పైగా గత ఏడాది జనవరి నెలాఖరు వరకూ శని గురువులు కలిసి ధనుస్సు రాశిలో ఉండటం కూడా జరిగింది. అదే సమయంలో అక్కడ కేతువు కూడా ఉన్నాడు. కర్మ చేయకుండా కేతువు నిలిపివేశాడు అని మనమంతా భావించాల్సి ఉంటుంది. సాధారణంగా శని, గురువు ఒకే రాశిలో ఉండటం అరుదుగా జరుగుతుంటుంది. మనకు ఉన్న 12 రాశుల్లో ఒక్కొక్క రాశినీ తీసుకుంటే 60 ఏళ్లకు గాని ఆ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలవడం కుదరదు. ఉదాహరణకు ఈ నెల నవంబరులో శని, గురువు మకర రాశిలో ఉంటాయి. అంటే 60 ఏళ్ల క్రితం మాత్రమే ఆ రెండు గ్రహాలు ఆ రాశిలో కలిశాయన్న మాట.
ఈ నెలలో ఐదు గ్రహాలు రాశుల మార్పు
ఒకే నెలలో నాలుగైదు గ్రహాలు మారే సంఘటనలు కూడా అరుదుగానే జరుగుతుంటాయి. చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకూ ఒకసారి మారుతుండం సర్వసాధారణం. అది కాకుండా మిగతా గ్రహాలు మారుతుండటాన్ని విశేషంగా భావించాలి. ఈ నెల2 వ తేదీన బుధుడు సింహం నుంచి కన్యకు మారాడు. 16వ తేదీ తర్వాత సూర్యుడు కూడా కన్యా రాశికి మారాడు. ఈ నెల 23వ తేదీన రాహుకేతువులు మారుతున్నాయి. శుక్రుడు ఈనెల 28వ తేదీన సింహరాశిలోకి మారతాడు. రాశి చక్రంలో ఇదొక కీలక ఘట్టం అనుకోవాలి. చాలామంది చెప్పేది ఏమంటే రాహుకేతువులకు వృషభం, వృశ్చికం ఉచ్ఛ స్థానాలు కాబట్టి అన్నీ పాజిటివ్ ఫలితాలే ఉంటాయని చెబుతారు. కానీ వ్యక్తిగత జాతక చక్రాలను పరిశీలించకుండా మనం ఏ నర్ణయానికీ రాలేం.
ఎవరికి మంచిది? ఎవరికి మంచిది కాదు?
తమ గోచారంలో రాహుకేతువులు ఏ రాశుల్లో ఉంటే ఆ రాశి వ్యక్తలు మీద అధిక ప్రభావం చూపిస్తూ ఉంటారు. దాంతో పాటు రాహుకేతువులకు 1-5-9 కాంబినేషన్ లో గురువు లేదా శని ఉంటే అలాంటి వారి మీద చెడు ప్రభావాన్ని రాహుకేతువులు చూపిస్తూ ఉంటారు. ఉదాహరణకు రాహువు వృషభంలోకి వచ్చాడనుకుందాం. ఒక వ్యక్తి పుట్టిన జాతక చక్రంలో వృషభంలో గరువు, శని ఉన్నా వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఇబ్బందికరమే. అలాగే వృషభం నుంచి 5వ స్థానంలో అంటే కన్యలో గురువు, శని ఉన్నా ఇబ్బందే, వృషభం నుంచి 9వ స్థానం మకరంలో గురువు, శని ఉన్నాఇబ్బందే.
అలాంటి వ్యక్తులు మాత్రం రాహుకేతువులకు శాంతులు చేసుకోవడం ఉత్తమం. ఇదే కాంబినేషన్ ను కేతువు నుంచి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే 12 రాశుల్లో ఆరు రాశుల మీద ఈ రాహుకేతువుల చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఇప్పటిదాకా వీటి వల్ల ఇబ్బదులు పడినవారికి మాత్రం చాలావరకు విముక్తి దొరుకుతుంది. ఇది భృగు-నంది నాడి జాతక విధానంలో చేసిన విశ్లేషణగా భావించాలి. ఈ గ్రహమార్పుల అనంతరం కరోనా కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇది జ్యోతిష పరమైన విశ్లేషణగానే భావించాలి. రాహుకేతువులు ఏఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపించనున్నారో మరో వ్యాసంలో తెలుసుకుందాం.
– హేమసుందర్ పామర్తి











