ఏపీలో దేవాలయాలపై దాడుల పరపర కొనసాగుతూనే ఉంది. అంతర్వేదిలో రథం దగ్థం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసింది. అంతర్వేది ఘటనకు ముందు కూడా అనేక దేవాలయాలను దుండగులు ధ్వంసం చేశారు. అయినా ఏపీ ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇప్పటికే ఏపీలో దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల ధ్వంసం చేసిన ఘటనలు 42 చోటు చేసుకున్నాయి. అయినా ప్రభుత్వం ఏ మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదని విశ్వహిందూ పరిషత్ మండిపడుతోంది. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా, ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హిందూ దేవాలయాల పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వీహెచ్ పీ నేతలు హెచ్చరిస్తున్నారు.
హిందూ దేవాలయాలనే ఎందుకు టార్గెట్ చేశారు
ఏపీలో ప్రతి వారం ఎక్కడో ఒక చోట దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొదట్లో గ్రామీణ ప్రాంతాల్లో చిన్న దేవాలయాలతో ప్రారంభమైన ధ్వంసరచన నేడు ప్రముఖ దేవాలయాలకు కూడా ఈ విష సంసృతి విస్తరించడం ఆందోళన కలిగిస్తోందని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా ఏపీ భద్రాద్రిగా పేరుగాంచిన విజయనగరం రామతీర్థం బోడికొండపై కొలువైన కోదండరాముల వారి విగ్రహం శిరస్సును కొందరు దుండగులు ధ్వంసం చేయడం పెద్ద సంచలనంగా మారింది. సాక్షాత్తూ రాముల వారి విగ్రహం ధ్వంసం చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రామతీర్థం చేరుకుని నిరసన తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని కోదండ రాముని విగ్రహంపై పనిగట్టుకొని దుండగులు దాడి చేశారని, దాడికి పాల్పడిన వారిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని రామతీర్థం పరిరక్షణ పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసనంద స్వామి డిమాండ్ చేశారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన రామతీర్థంలో దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాలను పరిశీలించనున్నారు. రాష్ట్రంలో ఓ పథకం ప్రకారమే హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పథకం ప్రకారమే దాడులా?
ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నా ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 42 దేవాలయాలపై దాడులు జరిగినా ఇంత వరకు ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకున్న దాఖలాలు లేవని, ఇవన్నీ చూస్తుంటే హిందూ దేవాలయాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తున్నట్టు భావించాల్సి వస్తోందని బీజేపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలు ధ్వంసం చేసినా, దేవాలయాల్లో దొంగతనాలు జరిగినా పోలీసులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని వారు విమర్శించారు. సాక్షాత్తూ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి అరకిలో మీటరు దూరంలో ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయ రథంపై ఉన్న వెండి సింహాల ప్రతిమలు మాయం అయిన కేసును ఇంత వరకు ఏమీతేల్చలేకపోయారని వీహెచ్ పీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.
ఒకటి కాదు వరుస ఘటనలు..
ఏపీలో దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పిఠాపురం, అంతర్వేది ఘటనలపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. వారి ఒత్తిడి ఫలితంగానే అంతర్వేదిలో దుండగులు దహనం చేసిన రథాన్ని ఆగమేఘాలపై పునరుద్ధరిస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా వెల్దుర్తి, కృష్ణా జిల్లా నిడమానూరు సాయి బాబా గుడి, కొల్లూరులోని ఆంజనేయస్వామి దేవాలయం, తుమ్మూరులో ఏడు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ ధ్వంసం, పిఠాపురంలో వెంకటేశ్వరస్వామి దేవాలయంతో పాటు 23 విగ్రహాల ధ్వంసం, అబ్బూరు గంగమ్మ తల్లి దేవాలయం ధ్వంసం, కర్నూలు నగరంలో ఆంజేయస్వామి దేవాలయ విగ్రహాల ధ్వంసం ఇలా ఏపీలో దేవాలయాల ధ్వంస రచన కొనసాగుతూనే ఉంది. తాజాగా రాజమండ్రిలోని ప్రసిద్ద నాగసమేత సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలోని విగ్రహాల ధ్వంసం, విశాఖ జిల్లా పాడేరు పరిధిలోని అమ్మవారి ఆలయంలో అమ్మవారి పాదాలను దుండగులు ధ్వంసం చేశారు. దేవాలయాల ధ్వంసంపై ఇప్పటి వరకూ ఏపీ సీఎం పోలీసు అధికారులతో ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడం దారుణమని వీహెచ్ పీ నేతలు విమర్శిస్తున్నారు. ఏపీలో దేవాలయాలపై దాడులపై ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వారు పిర్యాదు చేశారు.
సీబీఐ విచారణకు ఆదేశించాలి
ఏపీలో దేవాలయాల ధ్వంసంపై బీజేపీ నేతలు కూడా కళ్లు తెరిచారు. దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా వారు చాలా కాలం నోరు మెదప లేదు. అంతర్వేది ఘటనలోనూ బీజేపీ నాయకుల కన్నా వీహెచ్ పీ నేతలు గట్టి పోరాటం చేశారు. దీంతో హిందూ భక్తులు బీజేపీ నేతలను నిలదీయడం మొదలు పెట్టారు. పరిస్థితిని గ్రహించిన బీజేపీ నేతలు హిందూ దేవాలయాలపై దాడులను ఖండించడంతోపాటు సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ జీవీఎల్ నరసింహారావు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణ రాజు కూడా ప్రధాని మోడీకి.. సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాశారు. అయినా కేంద్రం స్పందించలేదు. దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా ఏపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక కేంద్రం చర్యలు తీసుకుంటుందని అని ఆశించడం భ్రమే అవుతుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పథకం ప్రకారమే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు దేవాలయాలపై దాడుల విషయంలో వీహెచ్ పీ నేతలు సీరియస్ గా ఉన్నారు. దేశ వ్యాప్త ఉద్యమానికి సిద్దమవుతున్నారని తెలుస్తోంది.