కర్నూలు జిల్లాలోని శ్రీశైల క్షేత్రానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగం, శక్తి పీఠం ఒకే చోట వెలసిన పీఠంగా శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేకత ఉంది. హిందువులకు పవిత్ర క్షేత్రంగా కొనసాగుతున్న శ్రీశైలంలో ఇప్పుడు అన్య మతస్తులు… ప్రత్యేకించి ముస్లింల ఆధిపత్యం కొనసాగుతోంది. దీనిపై జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం నిద్ర నటిస్తున్నా.. తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో ఫైరయ్యారు. హిందువుల క్షేత్రంలో ముస్లింల ఆధిపత్యం ఏమిటండి? దీనిపై తక్షణమే చర్యలు తీసుకోండి అంటూ ఆయన ఇటీవల సీఎం జగన్‌కు ప్రత్యేకంగా ఓ లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది.
చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరుడు
భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువు దీరిన శ్రీశైలంలో ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ వైసీపీ నేత తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారట. శ్రీశైలం ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి చెందిన శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు. సదరు ఎమ్మెల్యే గారికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్న ఓ ముస్లిం నేత శ్రీశైల క్షేత్రంలోని మొత్తం వ్యవహారాలు తన కనుసన్నల్లోనే కొనసాగేలా చూస్తున్నారట. ఈ క్రమంలో శ్రీశైలంలో జరిగే దాదాపుగా అన్ని కార్యక్రమాలపై తనదైన పట్టు సాధించిన సదరు ముస్లిం నేత… ఈ క్షేత్రంలో చీమ చిటుక్కుమనాలన్నా… తన అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారట. అందులో భాగంగా క్షేత్రం పరిధిలోని దుకాణాల్లో మెజారిటీ దుకాణాలను తన సామాజిక వర్గానికి చెందిన వారే నిర్వహించేలా చక్రం తిప్పారట. తన వ్యవహారాలకు అడ్డుగా నిలుస్తున్నారన్న భావనతో ప్రస్తుతం శ్రీశైలం ఈవోగా కొనసాగుతున్న అధికారిని కూడా బదిలీ చేయించేందుకు సదరు ముస్లిం నేత యత్నించారట.
Must Read ;- దేవుడైతే మాకేంటి? ప్రభుత్వం మాది.. ఏమైనా చేస్తాం..

కూపీ లాగిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
ఇది చాలా గుట్టుగా సాగుతున్నా… ఇటీవల శ్రీశైలం వెళ్లిన బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కంట పడిందట. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై కూపీ లాగిన రాజా సింగ్… అక్కడ జరుగుతున్న తంతు, హిందూ దేవాలయ పరిధిలో ముస్లిం మతానికి చెందిన వ్యక్తి పెత్తనంపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు హిందూ మతానికి చెందిన ఆలయాల పరిధిలో అన్య మతాలకు చెందిన వారు అడుగుపెడితేనే గగ్గోలు పెట్టే పరిస్థితి. అలాంటిది శ్రీశైలంలో ఏకంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్ని వ్యవహారాల్లో తల దూర్చేసి అంతా తానై వ్యవహరిస్తుండటం వైసీపీ నేతలకు కనిపించడం లేదా? అని రాజా సింగ్ ప్రశ్నించారు. వెనువెంటనే ఆయన సీఎం జగన్‌కు ఓ లేఖ రాశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ..
ఈ లేఖలో శ్రీశైల క్షేత్రంలో వైసీపీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, ముస్లిం మతస్తుడు కొనసాగిస్తున్న తంతును వివరించారు. అంతేకాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న సదరు ముస్లిం నేతపై చర్యలు తీసుకోవడంతో పాటుగా ఓ హిందువుగా ఉంటూ.. ఈ తరహా దుస్సంప్రదాయానికి అవకాశం కల్పించిన శిల్పా చక్రపాణిరెడ్డిని కట్టడి చేయాలని కూడా రాజా సింగ్ సదరు లేఖలో జగన్‌ను కోరినట్లు తెలిసింది. ఏపీలో ఉన్న ప్రతిపక్షం టీడీపీ ప్రస్తావిస్తున్న అంశాలనే పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించని జగన్ సర్కారు.. పొరుగు రాష్ట్రం తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ లేవనెత్తిన సమస్యను పట్టించుకుంటుందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
Also Read ;- ఇది సర్కారు వారి చర్చి.. రండి.. తరించండి!











